సినిమాను తలపిస్తున్న పెళ్లి వేడుకలు
Published Sun, Sep 15 2013 3:53 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు పెళ్లంటే వారం రోజుల పండగలా ఉండేది. బంధువుల రాక.. పెళ్లి ఏర్పాట్లతో పెళ్లి సందడి నెలకొనేది. రానురాను పెళ్లి తంతులో కూడా మార్పు జరిగింది. ఏడడుగులు నడవడం.. తలంబ్రాలు పోసుకోవడం.. పెళ్లితంతు ముగించేవారు. పెళ్లినాటి మధుర స్మృతులను వీడియోలో బంధించేవారు. కొడుకులు పెద్దపెరిగాక పెళ్లినాటి వీడియోలను చూపించి ముచ్చటపడిపోయేవారు. అయితే మారుతున్న కాలానుగుణంగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పెళ్లి తంతు కూడా నయా ట్రెండ్‌లో నడిపిస్తున్నారు. వీడియో తీయడంతోనే సరిపెట్టడం లేదు. ఖరీదైన పెళ్లిగా నిలిచిపోయే విధంగా ఆ చిత్రాలను డిజైన్ చేస్తున్నారు. స్టేటస్‌కు, బడ్జెట్‌కు ముందూ, వెనకా ఆడకుండా పెళ్లి వీడియో క్యాసెట్లను తయారు చేయిస్తున్నారు. సినిమా టైటిల్స్‌ను మరిపించే విధంగా గ్రాఫిక్‌లతో వధూవరుల పేర్లు వేయడం, వారి ఫొటోలను రకరకాలుగా చూపించడం, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు వేయడం, పెళ్లి విశేషాలు, పాటలు, పెళ్లి సన్నివేశాలు గ్రాఫిక్‌గా వేస్తూ సినిమాను తలపించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి.
బెంగళూర్‌లో ఫొటో ఆల్బమ్ తయారీ
ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లి ఫొటోలు హైటెక్నాలజీతో ఫొటోలను ప్రింట్ చేస్తున్నారు. తొలుత హైదరాబాద్, విజయవాడలో ఫొటోలు పెద్ద సైజులో కడిగే మిషిన్స్ ఉన్నాయి. అయితే అక్కడి కంటే బెంగళూర్‌లో ఇంకా మంచి పెద్ద సైజు ఫొటోలు గ్రాఫిక్స్‌తో ఆల్బమ్‌లుగా తయారు చేస్తున్నారు. ఇక్కడి ఫొటోగ్రాఫర్లు ఇంటర్నెట్‌లో ఫొటోలను బెంగళూర్‌కు పంపిస్తే అక్కడ ఫొటో ఆల్బమ్‌ను తయారు చేసిన అనంతరం కొరియర్ ద్వారా పంపిస్తారు. ఒక్కో ఆల్బమ్ తయారీకి రూ.15 వేలు తీసుకుంటారు. ఈ ఖర్చంతా ముందుగా ఒప్పందం ప్రకారం తీసుకున్న డబ్బులో నుంచే ఫొటోగ్రాఫర్ భరిస్తాడు.
ఫొటో అండ్ వీడియోగ్రాఫర్లే దర్శకులు
ఈ సినిమాటిక్ వివాహాల్లో అసలు సిసలు పాత్ర అంతా ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌దే. అత్యుత్తమ కెమెరాలు, పక్కా స్క్రిప్ట్, సంగీత నేపథ్యాలతో ఫ్రీ ప్రొడక్షన్, రికార్డింగ్స్.. ఇవన్నీ అచ్చం సినిమాకు చేసినట్టే జరుగుతాయి. ఈ తరహాలో తమ పెళ్లిని రూపొందించుకోవాలని సిద్ధమైన వారు తమ బడ్జెట్‌ను చెప్పి, అది ఒకే అయ్యాక వధూవరుల వృత్తి వ్యాపకాలతో పాటు బంధుమిత్రుల సహా తమవారి వివరాలను రూపకర్తలకు అందిస్తారు. అది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది కూడా తెలియపరుస్తారు. అన్ని వివరాలు తీసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు పెళ్లి థీమ్‌కు అనుగుణంగా జరిగేలా, ముహూర్తాలతో సమన్వయం చేసుకుంటూ పెళ్లి తంతును సినిమాటిక్‌గా డిజైన్ చేస్తారు. పెళ్లికొడుకు చెవిలో మరదలు చెప్పే సరదా కబుర్ల నుంచి నవవధువును అత్తింటికి పంపే అంపకాల సమయంలో చెమర్చిన కళ్లను దాచుకునే పెద్దల విఫలయత్నాల వరకూ పెళ్లి వేడుకల్లో తళుక్కున మెరిసే సహజమైన సన్నివేశాలను లాఘవంగా పట్టుకోవడం పైనే దృష్టిసారిస్తారు. ఒక్కో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ రూ.50 నుంచి రూ.75 వేల వరకు పెళ్లి ఆల్బమ్స్‌కి తీసుకుంటున్నారు.
మూడు గంటల పెళ్లి చిత్రీకరణకు తెర
ఒకప్పుడు పెద్ద వీడియో క్యాసెట్లు ఉండేవి. వరపూజ నుంచి మొదలుకొని పెళ్లి, రిసెప్షన్ వరకు వీడియో తీసేవారు. మూడు గంటల పెళ్లి వేడుకను చూడడం ఇబ్బందిగా మారేది. రానురాను ఆ పెద్ద క్యాసెట్ల స్థానంలో చిన్న క్యాసెట్లు వచ్చాయి. ప్రస్తుతం అవి కూడా తెరమరుగయ్యాయి. క్యాసెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల పనికిరాకుండా పోయాయి. పైగా ఇప్పుడు వీడియో క్యాసెట్ ప్లేయర్లు లేవు. అన్ని సీడీ, డీవీడీ ప్లేయర్లు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక పెళ్లిని తక్కువ నిడివిలోనే అత్యంత ఆసక్తిగా మలచడం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఉద్భవించినవే ఈ సినిమాటిక్ వెడ్డింగ్స్. వీటిలో పెళ్లి చూపుల దగ్గర్నుంచి ఎంగేజ్‌మెంట్, వివాహ వేడుక అంతా కలిపి కేవలం 15 నుంచి 25 నిమిషాల్లోపు ముగిసిపోతుంది. చక్కని నేపథ్య సంగీతంతో, ఎడిటింగ్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు వధూవరుల అనుభూతులను, మనోభావాలను దీనికి జతచేసి ఓ అందమైన కదిలే చిత్రంగా కనువిందు చేస్తుంది. హెచ్‌డీతో కూడిన వీడియో అండ్ కెమెరాలు వచ్చాయి. వాటికి క్యాసెట్లు ఉండవు. మెమరి కార్డు ఉంటుంది. అందులోనే వివాహ వేడుక మొత్తం రికార్డు అవుతుంది. మొత్తం పెళ్లితంతు ముగిసిన అనంతరం గంట వరకే కుదిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని వీడియో తీసినప్పటికీ అవసరమైన మేరకు మాత్రమే మెమరీ కార్డులో కాపీ చేసుకుంటున్నారు. వాటిని పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నారు.
కొత్తగా స్క్రీన్‌లు వచ్చాయి
ఒకప్పుడు పెళ్లిళ్ల సందర్భంగా సంపన్నులైతే అందరూ వివాహ వేడుకలను చూసే విధంగా కల్యాణ మండపాల ప్రాంగణాల్లో అక్కడక్కడ టీవీలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో పెద్దపెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్‌లు వచ్చాయి. జిల్లాలో సుమారు 20 వరకు ప్రొజెక్టర్ స్క్రీన్‌లు ఉన్నాయి. ఒక్కో స్క్రీన్‌కు రూ.6 వేలు చార్జీగా వేస్తారు. జనం ఎక్కువగా ఉండే హాలులో స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి వేడుకలను టీవీల ద్వారా నేరుగా చూసే సౌలభ్యం వచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని పెళ్లిళ్లు, రిసెప్షన్లలో క్రేన్‌ల ద్వారా వీడియో చిత్రీకరణ జరిగాయి. ఆర్థిక ఖర్చుతో కూడుకున్నప్పటికి కొంతమంది తమ స్టేటస్ కోసం వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఫొటో ఆల్బమ్
ఒకప్పుడు ఫొటోలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. వీడియో క్యాసెట్లు, సిస్టం అందుబాటులో లేని సమయంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు ఎంతో ఆదరణ ఉండేది. పెళ్లి తర్వాత నెల, రెండు నెలలకు ఫొటోలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉదయం పెళ్లి జరిగితే మధ్యాహ్నం కల్లా ఫొటోలు వస్తున్నాయి. డిజిటల్ సిస్టం రావడం మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి లాంటి పట్టణాల్లో డిజిటల్ కలర్ ల్యాబ్‌లు వెలిశాయి. బ్లాక్ అండ్ ఫొటోకు ఫొటోగ్రాఫర్ రూ.35 తీసుకునేది. ఆ తర్వాత కలర్ ఫొటో రాగా పోస్టు కార్డుకు రూ.15, 4/6, 12/6, 12/36 ఇప్పుడు తాజాగా నడుస్తుంది. ఒక్కో ఫొటో రూ.20 నుంచి రూ.600 వరకు చేరుకుంది.
ఉపాధి పెరిగింది...
డిజిటల్ సిస్టం వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది. ఫొటో, వీడియోలు నైపుణ్యంతో తీసేవారికి మంచి డిమాండ్ పెరిగింది. జిల్లాలో ఫొటోగ్రాఫర్లు సుమారు 1500లు, వీడియోగ్రాఫర్లు 2000ల వరకు ఉన్నారు. వివాహం జరిపించే వారు డబ్బులకు వెనకంజా వేయడం లేదు. కల్యాణ మండపం మొదలుకొని వీడియో, ఫొటోలు చాలా ఖరీదుగా ఉండాలని చెప్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆల్బమ్ తయారు చేయించే మేము ఇప్పుడు హెచ్‌డీ టెక్నాలజీతో ఫొటోప్రింట్‌లు వేసే బెంగళూర్‌కు పంపిస్తున్నాం. దీని వల్ల అందరికీ ఉపాధి లభించడంతో పాటు చిరకాలం నిలిచిపోయే విధంగా ఫొటోలు ఉంటున్నాయి. ఇక వీడియో విషయానికి వస్తే సినిమా గ్రాఫిక్‌లకు తీసిపోని విధంగా రూపొందిస్తున్నాం. ఎదురుకోళ్లు ఎలా ఉండాలి. పెళ్లి పీటల పై ఎలాంటి ఫొటోలను చిత్రీకరించాలి లాంటివి మొదలుకొని అప్పగింతలు, అరుంధతి నక్షాత్రాన్ని చూపించే వరకు అన్ని వీడియో, ఫొటో చిత్రీకరణ అంతా మా దర్శకత్వంలోనే జరుగుతాయి. ఒకప్పటికి, ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కేవలం అరగంట, గంట నిడివి గల వీడియో తయారు చేస్తున్నాం.
- ఎం.కె.రాము, సీనియర్ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్, మంచిర్యాల
Advertisement