
మరో గంటన్నరలో పెళ్లి వేదిక వద్దకు చేరాల్సిన వారు అనుకోని ప్రమాదానికి లోనయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం.. విధి ఆడిన నాటకంలో ఓ మహిళ ఓడిపోగా.. పెళ్లి కుమారుడు సహా 17 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన పీలేరులో విషాదాన్ని నింపింది. బంధువుల ఆర్తనాదాలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి.
పీలేరు : పీలేరు–కడప జాతీయ రహదారిలోని ముడుపులవేముల పంచాయతీ యల్లంపల్లె వద్ద ఆదివారం పెళ్లి వ్యాను బోల్తా పడింది. దీంతో ఒక మహిళ దుర్మరణం చెందగా పెళ్లి కుమారుడితోపాటు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కడపకు చెందిన గోవిందాచారి కుమారుడు ప్రదీప్‌కు చిత్తూరులో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు ప్రదీప్ తోపాటు బంధువులు తుపాన్ వ్యాన్‌లో బయలుదేరారు. పీలేరు సమీపంలోని యల్లంపల్లె క్రాస్ వద్ద వేగంగా వెళుతున్న వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పింది.
రోడ్డు పక్కనున్న సూచిక బోర్డుపై దూసుకుపోయి పక్కనే గుట్టను ఢీకొంది. అందులోని వారు చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడి చిన్నమ్మ సుధ (55) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఉమామహేశ్వరి, గోవిందాచారి, వరలక్ష్మి, చిత్రలేఖ, పెళ్లి కొడుకు ప్రదీప్, భాస్కర్, కళావతి, గణేష్ ఆచారి, మోహిత్‌కుమార్, సుమతి, శివకృష్ణ, శ్రీవల్లి, హేమలత, నవీన, నాగమణి, డ్రైవర్ సయ్యద్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు సీఐ కె.వేణుగోపాల్, ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
14 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. సుధ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో పెళ్లి బృందం ఆర్తనాదాలు మిన్నంటాయి. మరో గంటన్నర సమయంలో వివాహ వేదికకు చేరుకునే లోపే ఊహించని విధంగా ఘోర ప్రమాదానికి గురికావడంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment