పెళ్లయిన 45 రోజులకే..
యువతి అనుమానాస్పద మృతి
భర్తే హత్య చేశాడంటున్న బంధువులు
పోలీసుల అదుపులో మృతురాలి భర్త
జగ్గయ్యపేట : తల్లి ప్రేమకు నోచుకోకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెకు ఆ తండ్రి ఘనంగా వివాహం చేశాడు. కుమార్తె జీవితం బావుంటుందని రాజధాని ప్రాంతంలో అరెకరం పొలం లాంఛనంగా ఇచ్చాడు. అయితే పెళ్లయిన 45 రోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో కన్నతండ్రి భోరున విలపించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.
పోలీసుల కథనం మేరకు.... పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన జిడుగు వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణి (18)తో 45 రోజుల క్రితం వివాహమైంది. నూతన దంపతులు బుధవారం ఉదయం నల్గొండ జిల్లా మేళ్లచెరువు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి పెనుగంచిప్రోలు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట బైపాస్ రోడ్డులో తన ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై రాణి గాయపడిందంటూ ఆమెను తన స్నేహితుడి సాయంతో వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో రెండు వైపుల బంధువులకు వెంకటనారాయణే సమాచారం ఇచ్చాడు. రాణి తండ్రి మునగోటి ప్రసాద్, పెదనాన్న దేవరకొండ బ్రహ్మం హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి నిర్జీవంగా పడివున్న రాణిని చూసి భోరున విలపించారు. ఆమె మెడపై ఉరివేసినట్టు కమిలిన గుర్తు ఉండటంతో భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడంటూ రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.ఎల్.రావు, అదనపు ఎస్‌ఐ వి.వి.రావు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నందిగామ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు గురువారం ఉదయం రాణి మృతదేహాన్ని పరిశీలించి బంధువులను అడిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
భర్తే హత్య చేశాడు..
ఒక్కగానొక్క కూతురువి.. తల్లి లేకపోయినప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకున్నా.. సంసారం బావుంటుందని బంధువుకే ఇచ్చి పెళ్లిచేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండిపోయాయా తల్లీ అంటూ రాణి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తెను భర్తే హత్య చేశాడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాణి భర్త వెంకట నారాయణ పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య మృతికి తానే కారణమని పోలీసుల ముందు ఒప్పుకున్నాడని సమాచారం.