
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
భీమవరం అర్బన్ : స్థానిక 32వ వార్డులో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. తన కుమార్తెను ఉరివేసి చంపేశారని తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మృతురాలి తండ్రి పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళ్ళ మండలం సీసలి గ్రామానికి చెందిన వాసుకూరి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని పెద్ద కుమార్తె రామలక్ష్మిని పట్టణానికి చెందిన శంకు సత్యనారాయణ కుమారుడు శంకు రాంబాబుకు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. రాంబాబు కాంట్రాక్టర్. వారికి ఒక ఒక కుమార్తె కలిగింది. రెండేళ్ల క్రితం రామలక్ష్మి మృతిచెందింది. అయితే అమె మృతి చెందడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
అప్పటికే వారిద్దరికీ ఏడేళ్ల కుమార్తె ఉండటంతో రామలక్ష్మి తండ్రి వెంకటేశ్వరరావు తన రెండో కుమార్తె ఉమామహేశ్వరిని రాంబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ప్రస్తుతం ఏడాది కుమార్తె ఉంది. రాంబాబు, ఉమామహేశ్వరిలు ఇద్దరూ 32వ వార్డులోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం అద్దెకు ఉంటున్న ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు చీర కట్టి ఉమామహేశ్వరి ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న ఉమామహేశ్వరి తండ్రి వెంకటేశ్వరరావు, అతని భార్య, బంధువులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని పోలీసులకు సమాచారమందించారు. టూటౌన్ ఎస్సై శ్రీనివాసకుమార్, ఏఎస్సై ఖాన్ తదితరులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. తన కుమార్తె చావుకు భర్తే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు.
కట్నం కింద పెద్ద కుమార్తెకు ఎకరం పొలం, చిన్న కుమార్తెకు ఎకరం పొలం ఇచ్చామని, పెద్ద కుమార్తె వివాహ సమయంలో రూ.1,70,000, చిన్న కుమార్తె సమయంలో రూ.1,40,000లు నగదు ఇచ్చానని, ఇవి కాకుండా బంగారం, వెండి వస్తువులు పెద్దఎత్తున పెట్టానని, ఇద్దరు కుమార్తెలను చంపేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పులున్నాయని, పొలం అమ్ముకుని రమ్మని ఇటీవల తన కుమార్తెను భర్త రాంబాబు వేధిస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఉమామహేశ్వరి తన సూసైడ్ లేఖలో పేర్కొంది. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని, సూసైడ్ నోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్సై శ్రీనివాసకుమార్ తెలిపారు.