అత్తింటి వేధింపులకు బలి
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
భర్త, అత్తమామలే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
బొమ్మూరు (రాజమండ్రి రూరల్) :భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బొమ్మూరు గ్రామంలోని రాఘవేంద్రనగర్‌లో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మూరుకు చెందిన 108 టెక్నీషియన్ కాండ్రేగుల రవికుమార్‌కు, రాజమండ్రి సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ రమణ కుమార్తె స్వాతి(28)కి 2010లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె లిఖిత ఉంది. విశాఖపట్నంలో ఉన్న రవికుమార్ తల్లిదండ్రులు నెలకోసారి ఇక్కడకు వచ్చి, వెళుతుంటారు. నర్సరీ చదువుతున్న లిఖితను స్వాతి ఉదయం, సాయంత్రం స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం లిఖితను స్కూల్‌కు తీసుకువెళ్లిన స్వాతి, సాయంత్రం తీసుకురాలేదు. దీంతో స్కూలు వారు రవికుమార్‌కు ఫోన్ చేసి, పాపను తీసుకువెళ్లాలని చెప్పారు.
వెంటనే రవికుమార్ భార్య స్వాతికి ఫోన్ చేయగా, ఎంతసేపటికీ స్పందించలేదు. డ్యూటీలో ఉన్న అతడు ఇంటి కి వచ్చాడు. ఈలోగా పాపను పక్కింటి అబ్బాయి స్కూలు నుంచి తీసుకొచ్చాడు. ఇంటిలోపలికి రవికుమార్ వెళ్లిచూడగా.. స్వాతి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని అతడు పక్కింటి వారికి చెప్పాడు. 108 పైలట్‌కు ఫోన్ చేసి తన భార్యకు బాగోలేదని చెప్పడంతో.. అతడు 108ను తీసుకొచ్చాడు. స్వాతి మరణించినట్టు అతడు గుర్తించాడు. రవికుమార్ అత్తమామలకు ఆ పైలట్‌తో ఫోన్ చేయించాడు. వారి కుమార్తెకు నీరసంగా ఉందని, రావాలని చెప్పించాడు. స్వాతి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, రమణ, సోదరుడు సుధీర్ అక్కడకు చేరుకున్నారు. స్వాతి చనిపోయిందని తెలియగానే బోరున విలపించారు. అత్తమామలు రాకముందే రవికుమార్ తన కుమార్తెతో అక్కడి నుంచి పరారయ్యాడు. బొమ్మూరు ఎస్సై నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు. డీఎస్పీలు అస్మా ఫర్హీన్, అంబికాప్రసాద్, బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కనకారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించింది.
భర్త, అత్తమామల వేధింపుల వల్లే..
తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామల వేధింపులే కారణమని స్వాతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంబీఏ చదివిన స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పెళ్లి జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఎక్కువ కాలం తమ ఇంటిలోనే ఉండేదని చెప్పారు. తరుచూ గొడవలు జరగడం, పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి కాపురానికి పంపించడం జరిగాయని వివరించారు. నెల రోజుల క్రితం ఇదే పరిస్థితి తలెత్తితే.. తమను ఇంటికి రావొద్దని, ఫోన్‌లో మాట్లాడవద్దని రవికుమార్ వేధించినట్టు చెప్పారు. పుట్టింటికి వెళ్లి విలువైన సామాన్లు తేవాలని తరుచూ వేధించేవాడని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.4 లక్షలు కట్నం, సామాన్లు ఇచ్చినట్టు వివరించారు. ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు అప్పు ఇప్పించి, దాని వడ్డీ కూడా చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.