
వివాహిత దారుణ హత్య
ఆర్‌బీపురం (జామి) : ఆర్‌బీపురం గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. దాదాపు నలభై రోజుల కిందటే ఈ హత్య జరగడం, హత్య చేసిన తర్వాత కూడా నిందితుడు దర్జాగా అందరి మధ్య తిరగడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదై అనంతరం హత్యగా మారి న ఈ కేసును గాజువాక పోలీసులు ఛేదిం చారు. నగలు, నగదు కోసమే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సినీ ఫక్కీలో జరి గిన ఈఘటన వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం గాజు వాకకు చెందిన పక్కి అనూష (23) అనే వివాహిత 40 రోజుల నుంచి కనిపించడం లేదని గాజువాక పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
అనూష భర్త ఈశ్వరరావు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి. వీరికో కుమార్తె అనన్య ఉంది. గాజువాక సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. కుమార్తెకు భోజనం తినిపించడానికి అనూష రోజూ స్కూల్‌కు వెళ్లేది. ఆర్‌బీపురానికి చెందిన మాడెం ఎర్నికృష్ణ(35) ఈ స్కూల్‌కు ఆటోలో పిల్లలను తీసుకువచ్చేవాడు. ఈ నేపథ్యంలో అనూషతో ఆటోడ్రైవర్ కృష్ణ పరిచయం పెంచుకున్నాడు. ఆమె నగలపై కన్నేసిన కృష్ణ నెమ్మదిగా అనూషతో మాటలు కలిపి నమ్మకం కలిగించాడు. నలభై రోజుల కిందట ఆమెను ఆటో ఎక్కించి కిడ్నాప్ చేశాడు. ఒంటిపై ఉన్న నగలు, డబ్బులు తీసుకుని కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ఆర్‌బీపురం సమీపంలోని దాసరి కృష్ణ మామిడితోటలో ఉన్న నంద బావిలో పడేశాడు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న తొమ్మిది తులాల బంగారం, పదిహేను వేల రూపాయల నగదును అపహరించాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా గాజువాక వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సినిమా తెలివితేటలు చూపించాడు. అనూష సెల్‌ఫోన్‌ను అంతకుముందే తీసుకున్న కృష్ణ ఆ సెల్‌ఫోన్‌తో సహా హైదరాబాద్ వెళ్లి అక్కడ స్విచాఫ్ చేసి వదిలేశాడు. తర్వాత మళ్లీ గాజువాక వచ్చి తన పని తాను చేసుకున్నాడు. అంతకుముందే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూషను వెతుకుతూ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో సెల్ ఉన్నట్టు గుర్తించారు. అక్కడ కూడా విచారణ చేపట్టారు. అనూష రోజూ వెళ్లే పాఠశాల వద్ద పోలీసులు 30 మందిని విచారణ చేశారు. అనుమానితుల్లో ఆ స్కూల్‌కు ఆటో నడిపే కృష్ణ కూడా ఉన్నాడు. అతనిపై కూడా నిఘా పెట్టారు.
కృష్ణ... ఆర్‌బీపురం వచ్చి వేర్వేరు సెల్‌ఫోన్లలో తన సిమ్‌ను ఉంచి వినియోగించాడు. తరుచూ సెల్‌లు మార్చుతుండ డంతో పోలీసులకు అనుమానం బలపడింది. సెల్‌ఫోన్ ద్వారా నిందితుడిని పట్టుకుని విచారణ చేయగా కృష్ణ అసలు విషయం బయటపెట్టాడు. దీంతో విశాఖ ఏసీపీ కేవీ రమణ, గాజువాక సీఐ సీహెచ్ వివేకానంద జామి మండలం ఆర్‌బీపురం గ్రామంలో ఘటనా స్థలానికి వచ్చి మృతదేహన్ని నూతిలో నుంచి బయటకు తీశారు. చాలా రోజులు కావడంతో మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారింది. బంధువులు ఆ మృతదేహం అనూషదేనని గుర్తించారు. జామి తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, సర్పంచ్ పత్రి రమణమ్మ, వీఆర్వో మణి తదితరుల ఆధ్వర్యంలో శవ పంచనామా నిర్వహించారు. అక్కడే పోస్టుమార్టం కూడా చేశారు. కార్యక్రమంలో జామి ఎస్‌ఐ ఎం.ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు.