
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): బిడ్డను కన్న తర్వాత భర్త తనను పట్టించుకోవడం లేదని ఓ భార్య తన అత్తింటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన మధురానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ నేతాజీకాలనీకి చెందిన దొడ్ల తరుణ్‌కుమార్‌కు నందిగామకు చెందిన నాగమణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. తరుణ్‌కుమార్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమైన తర్వాత అదే వీధిలో మరో ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది.
రెండోసారి గర్భవతి కావడంతో మూడునెలల క్రితం నందిగామలోని పుట్టింటికి ఆమె వెళ్లింది. నాగమణి పుట్టింటికి వెళ్లడంతో భర్త తన దగ్గరకు చూసేందుకు రావడం తగ్గిపోయిందని, ఇంటిదగ్గర కూడా ఉండటం లేదని తెలుసుకున్న ఆమె భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని గురువారం అత్తింటికి వెళ్లి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం ఎస్సై రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె భర్త తరుణ్‌కుమార్ బందరురోడ్డులోని ఒక హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చికాకులను భరించలేక హాస్టల్‌లో ఉండాల్సి వచ్చిందని తరుణ్‌కుమార్ చెబుతున్నాడు. దీంతో ఎస్సై ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment