అత్తింటి వారి ఎదుట మౌన పోరాటం చేస్తున్న పోలా పుష్పావతి
ధర్మవరంటౌన్: అదనపు కట్నం వేధింపుల నుంచి విముక్తి కల్పించి, తన భర్తను తనతో కాపురానికి పంపించాలని పుష్పవతి అనే మహిళ అత్తింటి ఎదుట దీక్షకు కూర్చుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరంలోని బాలాజీనగర్‌కు చెందిన పుష్పవతికి చంద్రబాబునగర్‌కు చెందిన పోలా వెంకట రంగనాయకులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద 12 తులాల బంగారం ఇచ్చారు. ఏడాదిపాటు వీరి కాపురం సజావుగా జరిగింది. అనంతరం చిన్నపాటి గొడవలతో మొదలై అదనపు కట్నం వేధింపులకు దారి తీసింది. అనంతరం వీరు వేరుకాపురం పెట్టారు. కొద్దిరోజులు గడిచాక భార్య బంగారు నగలతో భర్త ఉడాయించాడు. కొన్నాళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరాడు. బంగారు పోతే పోయింది తన కూతురును కాపురానికి తీసుకువెళ్లాలని పుష్పవతి తండ్రి వెంకటేష్ బతిమాలితే.. అదనపు కట్నం, బంగారం ఇస్తేనే పిలుచుకుంటామంటూ అల్లుడితో పాటు వియ్యంకులు తేల్చి చెప్పారు. నాలుగేళ్లుగా భార్యాభర్తలను కలపాలని పెద్ద మనుషుల ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడాది కిందట రంగనాయకులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టేసింది.
నాకు మొగుడు కావాలి..
తన భర్తను తనకు అప్పగించాలని అత్తమామల ఇంటి వద్ద అరుగుపై పుష్పవతి శుక్రవారం ఉదయం దీక్ష చేపట్టింది. అత్తింటివారు తలుపు కూడా తీయకపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల వారినీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని పుష్పవతి తేల్చిచెప్పింది. ఈమె దీక్షకు సీపీఐ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరలక్ష్మి, పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు.
మళ్లీ విడాకులకు ప్రయత్నిస్తా..
తన భార్య చెప్పేవన్నీ అబద్ధాలని, ఆమెతో ఇన్నాళ్లూ నరకయాతన పడ్డానని బాల వెంకటరంగనాయకులు తెలిపాడు. విడాకుల కోసం మళ్లీ కోర్టులో దరఖాస్తు చేస్తానని విలేఖరులకు చెప్పాడు. తమ కుమారున్ని అకారణంగా చావగొట్టించిందని, ఇటువంటి కోడలు తమకు వద్దే వద్దంటూ మామ పోలా బాలప్ప పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment