వివాహిత అనుమానాస్పద మృతి
Published Thu, Oct 24 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
ముమ్మిడివరం, న్యూస్‌లైన్ : వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మందపాక సునీల్ కుటుంబం 20 ఏళ్ల క్రితం ముమ్మిడివరంలో స్థిరపడ్డారు. స్వర్ణకారుడైన సునీల్ కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన సరస్వతి(35)ని 2004లో అతడు పెళ్లి చేసుకున్నాడు.
వారికి ఏడేళ్ల కుమార్తె విజయలక్ష్మి, ఐదేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నారు. ప్రస్తుతం ముమ్మిడివరం నగర పంచాయతీలోని బళ్ల గేటు సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో వీరు నివసిస్తున్నారు. ఇలాఉండగా సోమవారం రాత్రి దైవ దర్శనం కోసం సునీల్ విజయవాడకు వెళ్లాడు. భర్త ఇంట్లో లేని సమయంలో సరస్వతి పూజగదిలోని పాలవెల్లికి ఉన్న తాడుతో ఉరివేసుకున్నట్టుగా చనిపోయి ఉంది. మంగళవారం మధ్యాహ్నం సమీప బంధువు సూర్యచంద్ర ఆమె మృతదేహాన్ని గమనించాడు.
ఈ మేరకు విజయవాడలో ఉన్న సునీల్‌తో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న సరస్వతి బంధువులకు సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం సరస్వతి తల్లి చింతాడ గంగాభవాని, తమ్ముడు రమేష్‌బాబు ముమ్మిడివరానికి చేరుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని గంగాభవాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముమ్మిడివరం సీఐ మహమ్మద్ అలీ, ఎస్సై జేజే రత్నప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రత్నప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement