women suspicious death
-
కొత్లాపూర్‌లో వివాహిత హత్య?
బషీరాబాద్(తాండూరు) : ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. బషీరాబాద్ మండలం దామర్‌చెడ్ అనుబంధ గ్రామం కొత్లాపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంత్యనాయక్, రేణుకాభాయి(30) భార్యభర్తలు. వీరికి నందిని(8), నితిన్(6) పిల్లలు ఉన్నారు. అయితే ఈ నెల 22న రాత్రి ఇంట్లో భార్యభర్తలు నిద్రించగా తెల్లారేసరికి భార్య రేణుకాభాయి ఉరివేసుకొని మృతి చెంది ఉంది. గ్రామస్తులు వచ్చి భర్తను ప్రశ్నింగా ఉరివేసుకొని చనిపోయిందని భర్త చెప్పాడు. మరోవైపు రేణుకాభాయి తల్లిదండ్రులు అల్లుడు సంత్యనాయక్ను నిలదీయగా అదేసమాధానం చెప్పాడు. జరిగిందేదో జరిగిందని ఆమె శవానికి దహన సంస్కరణలు చేశారు. ఆదివారం బంధువులు భర్తను గుచ్చి గుచ్చి అడుగగా పొంతన లేని సమాధానం చెప్పాడు. గ్రామానికి చెందిన శానప్ప, ఉశనప్ప అనే ఇద్దరు వ్యక్తులు తన భార్యపై అత్యాచారం చేసి చంపారని, విషయం బయటకు చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్లు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శానప్ప, ఉశనప్పలను సోమవారం గ్రామంలో చితకబాదారు. అయితే తాము ఎలాంటి నేరం చేయలేదని, అన్యాయంగా తమపై దాడి చేశారని వారు వాపోతున్నారు. దాడికి గురైన ఉశనప్ప మంగళవారం బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా భర్త సంత్యనాయక్ను బషీరాబాద్ ఏఎస్ఐ సంగమేశ్వర్ మంగళవారం పోలీస్ స్టేషన్లో విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడు. మరోవైపు హత్యపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామంలో మాత్రం భయాందోళన పరిస్థితులు అలుముకున్నాయి. -
ఎవరా మహిళ..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : మంటల్లో కాలి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసు మిస్టరీగా మారింది. ఆమె ఎవరన్నదీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల క్రితం కొత్తపాలెం నుంచి నరవ మార్గంలో ఖాళీ మైదానంలో మహిళ మంటల్లో కాలిపోతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రోజు నుంచీ పెందుర్తి, గోపాలపట్నం పోలీసులతో నగర పోలీసులంతా హైఅలెర్ట్ అయ్యారు. క్లూ సంపాదించే దిశగా శ్రమిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో గాలింపులు చేస్తున్నారు. కళ్ల జోడు ధరించి కాళ్లకు మోడల్ చెప్పులు ధరించి, కాళ్లకు మట్టెలు ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా వివాహితనే నిర్ధారణకు వచ్చినా.. ఆమె ఎవరన్నదీ మిస్టరీగా మారింది. వీడియో చిత్రాల ఆధారంగా సంఘటనను బట్టి ఆమెను కచ్చితంగా హతమార్చి కాల్చి చంపి ఉండొచ్చన్న సందేహాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఎలాగైనా ఛేదించి తీరాలని జాయింట్ పోలీస్‌కమిషనర్ రవికుమార్‌మూర్తి పట్టుదలతో ఉన్నారు. అనేక పోలీసు బృందాలతో శోధింపు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కలకలం రేపిన తప్పుడు సమాచారం మహిళకు సంబంధించి క్లూ దొరికిందంటూ ఓ పత్రికలో కథనం వెలువడడంతో పోలీస్‌కమిషనర్ యోగానంద్‌తో పాటు జాయింట్ సీపీ రవికుమార్‌మూర్తి అప్రమత్తమయ్యారు. అన్ని స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, టాస్క్ఫోర్సు అధికారులు, సిబ్బంది, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సిబ్బందితో గోపాలపట్నాన్ని జల్లెడపట్టారు. ఏసీపీ అర్జున్‌తో పాటు సీఐ పైడియ్య, స్పెషల్‌బ్రాంచి సీఐ వైకుంఠరావు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ తదతర అధికారులు, పోలీసులు య ల్లపువానిపాలెం అంతా గాలించారు. ఎటువంటి ఆధారం దొరక్కపోవడంతో కేసు శోధిస్తున్న తరుణంలో పోలీసులతో ఆటలేంటని మండిపడ్డారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జిన్నారం(పటాన్చెరు) : గుమ్మడిదల మండలంలోని బొంతపల్లికి చెందిన కీర్తన(24)అనే మహిళ బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. కీర్తన ఉదయం మంచం మీద నుంచి కిందపడడంతో మృతి చెందిందని భర్త తెలిపాడు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని కీర్తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ముమ్మిడివరం, న్యూస్‌లైన్ : వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మందపాక సునీల్ కుటుంబం 20 ఏళ్ల క్రితం ముమ్మిడివరంలో స్థిరపడ్డారు. స్వర్ణకారుడైన సునీల్ కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన సరస్వతి(35)ని 2004లో అతడు పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడేళ్ల కుమార్తె విజయలక్ష్మి, ఐదేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నారు. ప్రస్తుతం ముమ్మిడివరం నగర పంచాయతీలోని బళ్ల గేటు సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో వీరు నివసిస్తున్నారు. ఇలాఉండగా సోమవారం రాత్రి దైవ దర్శనం కోసం సునీల్ విజయవాడకు వెళ్లాడు. భర్త ఇంట్లో లేని సమయంలో సరస్వతి పూజగదిలోని పాలవెల్లికి ఉన్న తాడుతో ఉరివేసుకున్నట్టుగా చనిపోయి ఉంది. మంగళవారం మధ్యాహ్నం సమీప బంధువు సూర్యచంద్ర ఆమె మృతదేహాన్ని గమనించాడు. ఈ మేరకు విజయవాడలో ఉన్న సునీల్‌తో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న సరస్వతి బంధువులకు సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం సరస్వతి తల్లి చింతాడ గంగాభవాని, తమ్ముడు రమేష్‌బాబు ముమ్మిడివరానికి చేరుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని గంగాభవాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముమ్మిడివరం సీఐ మహమ్మద్ అలీ, ఎస్సై జేజే రత్నప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రత్నప్రసాద్ తెలిపారు.