హత్య జరిగిన ఇల్లు, హత్యకు గురైన రేణుకా భాయి(ఫైల్)
బషీరాబాద్(తాండూరు) : ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. బషీరాబాద్ మండలం దామర్‌చెడ్ అనుబంధ గ్రామం కొత్లాపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంత్యనాయక్, రేణుకాభాయి(30) భార్యభర్తలు. వీరికి నందిని(8), నితిన్(6) పిల్లలు ఉన్నారు. అయితే ఈ నెల 22న రాత్రి ఇంట్లో భార్యభర్తలు నిద్రించగా తెల్లారేసరికి భార్య రేణుకాభాయి ఉరివేసుకొని మృతి చెంది ఉంది.
గ్రామస్తులు వచ్చి భర్తను ప్రశ్నింగా ఉరివేసుకొని చనిపోయిందని భర్త చెప్పాడు. మరోవైపు రేణుకాభాయి తల్లిదండ్రులు అల్లుడు సంత్యనాయక్‌ను నిలదీయగా అదేసమాధానం చెప్పాడు. జరిగిందేదో జరిగిందని ఆమె శవానికి దహన సంస్కరణలు చేశారు. ఆదివారం బంధువులు భర్తను గుచ్చి గుచ్చి అడుగగా పొంతన లేని సమాధానం చెప్పాడు.
గ్రామానికి చెందిన శానప్ప, ఉశనప్ప అనే ఇద్దరు వ్యక్తులు తన భార్యపై అత్యాచారం చేసి చంపారని, విషయం బయటకు చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్లు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శానప్ప, ఉశనప్పలను సోమవారం గ్రామంలో చితకబాదారు. అయితే తాము ఎలాంటి నేరం చేయలేదని, అన్యాయంగా తమపై దాడి చేశారని వారు వాపోతున్నారు.
దాడికి గురైన ఉశనప్ప మంగళవారం బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా భర్త సంత్యనాయక్‌ను బషీరాబాద్ ఏఎస్‌ఐ సంగమేశ్వర్ మంగళవారం పోలీస్ స్టేషన్‌లో విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడు. మరోవైపు హత్యపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామంలో మాత్రం భయాందోళన పరిస్థితులు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment