అన్నీ అమ్మకాలే..!
అంగన్‌వాడీల భర్తీలో భారీగా అవినీతి
టీడీపీ నేతల జేబుల్లోకి రూ.10 కోట్లు
పెత్తనమంతా టీడీపీ ఎమ్మెల్యేలదే
వారి అవినీతి తెలిసినా చేష్టలుడిగిన యంత్రాంగం
{పభుత్వానికి నివేదించిన ఇంటిలిజెన్‌స
విశాఖపట్నం: ‘మేము స్థానికు లం.. మాకు అన్ని విద్యార్హతులున్నాయి. మా కెందుకు పో స్టింగ్‌లు ఇవ్వలేదు.. మేమేం పాపం చేసుకున్నాం.. మెరిట్ మాకు శాపమా? ఇంటర్వ్యూలకు ముందే అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకున్నారని తెలిసింది. అలాంట ప్పుడు ఇంటర్వ్యూలెందుకు నిర్వహిం చారు. మమ్మల్ని ఎందుకు పిలిచారు’ అంటూ పలువురు బాధితులు ఆవేదన.
‘కమిటీల్లో మాకు ప్రాతినిధ్యం ఉన్నా ఏం చేయలేకపోయాం. కమిటీలకు ఆర్డీవోలే చైర్మన్లుగా వ్యవహరించినప్పటికీ పెత్తనమంతా ఎమ్మెల్యేలదే. తెరవెనుక ఈ పోస్టుల భర్తీ కోసం జరిగిన ఆర్థిక లావాదేవీల పై నో కామెంట్. మెరిట్ ఉన్న వాళ్లకు సైతం మేం న్యాయం చేయలేకపోయాం’బాధితులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారి. ఇవిచాలు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల నియామకాల్లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందనడానికి చెప్పడానికి. ఈ పోస్టుల మాటున అక్షరాల రూ. పది కోట్లు చేతులు మారినట్టు విశ్వసనీయ సమాచారం. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల అమ్మకాల ద్వారానే సుమారు రూ.6 కోట్లు, మిగిలిన పోస్టుల ద్వారా మరో రూ.4 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలు దండుకున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల మెరిట్ ప్రకారం ఎంపిక చేసినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా కలెక్టర్ పేరిట ఐసీడీఎస్ అధికారులను బెదిరించి మరీ నిలుపుదల చేయించారు. అనంతరం ఆ అభ్యర్థులు కూడా తమకు లక్షలు ముట్టజెప్పితోనే పోస్టింగు ఆర్డర్లు ఇప్పించారు.
ఏజెన్సీతో సహా జిల్లాలోని 25 ప్రాజెక్టులపరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు 229, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 147,ఆయాలు 572, లింక్ వర్కర్స్ 830, కృషి వర్కర్స్ 49 కలిపి మొత్తం 1115 పోస్టులకు సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ ఇస్తే మొత్తం 4,663 మంది దరఖాస్తు చేసుకున్నారు. నియామకాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిటీల్లో ఎమ్మెల్యేలను తప్పించి ఆ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డుకట్టపడలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు తాము సూచించిన వారికే పోస్టింగ్‌లు దగ్గేలా ఎక్కడికక్కడ చక్రం తిప్పగలిగారు. కార్యకర్తల నుంచి ఆయాల వరకు నూటికి 80 శాతం పోస్టింగ్‌లు వీరు సూచించిన వారికే దక్కడం ఇందుకు నిదర్శనం.
జిల్లాలో మెజార్టీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలు, ఆయా పోస్టులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, లింక్ వర్కర్స్, మినీ కార్యకర్తలు, క్రషి వర్కర్స్ నుంచి కూడా రూ.50వేల వరకు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల కోసం కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల్లోనే పోటీ ఏర్పడడంతో ఆయాప్రాంతాల్లో వేలం పాటలు కూడా పెట్టినట్టు వార్తలొచ్చాయి. విశాఖ దక్షిణ నియోజక వర్గంలో నేరెళ్ల కోనేరు కేంద్రంలో ఆయా పోస్టుకు జన్మభూమి కమిటీసిఫార్సు మేరకు ఓ తటస్థ అభ్యర్థి నుంచి పార్టీ నేతలు రూ.50 వేలు వసూలు చేశారు. కానీ పోస్టింగ్ దక్కకపోవడంతో ఇచ్చిన డబ్బుల కోసం ఆమె నేతల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తూనే ఉంది. నర్సీపట్నం డివిజన్‌లో మెరిట్ ప్రకారం ఎంపికైన ఆయాలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఆపివేయించి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. మరికొంత మంది నేటికీ పోస్టింగ్‌ల కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది.