కోదండ రామాలయంలో భారీ చోరీ | massive theft in kodanda ramalayam | Sakshi
Sakshi News home page

కోదండ రామాలయంలో భారీ చోరీ

Published Sun, Dec 29 2013 2:37 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

massive theft in kodanda ramalayam

మెదక్ టౌన్, న్యూస్‌లైన్ :  పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గల కోదండ రామాలయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రెండు పంచలోహ విగ్రహాలు, వెండి, తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనను నిరసిస్తూ.. ఆగ్రహించిన స్థానికులు, అఖిల పక్ష నేతలు ఆలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి దొంగలు గుడి తాళాలు, గర్భ గుడి షట్టర్‌తో పాటు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు.

పంచలోహ విగ్రహాలైన సీతమ్మ తల్లి, శ్రీకృష్ణుడు విగ్రహాలతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారు పుస్తెలు చోరీ చేశారు. అయితే ఈ భారీ చోరీని తెలుసుకున్న వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే ఇదే ఆలయంలో నాలుగుసార్లు చోరీ జరిగినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

హిందూ ఆలయాల వద్ద పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ వనజాదేవి, డీఎస్పీ గోద్రూ, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. స్పందించిన ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు.  కాగా ఆలయం చోరీ దృష్ట్యా స్థానికులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయించారు. ఆలయంలో క్లూస్‌టీం బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలను ఏబీవీపీ నేతలు మూసివేయించారు.

సాయంత్రం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివాస్, టీ చంద్రపాల్, దుర్గ ప్రసాద్, కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ్, మల్కాజి సత్యనారాయణ, కొండశ్రీను, మ్యాడం బాలకృష్ణ, మధు, కాశీనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్, ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూచార్యులు, బ్రాహ్మణ సంఘం నేతలు వైద్య శ్రీనివాస్, కృష్ణమూర్తి, రాజు పంతులు, కృష్ణమూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, కృష్ణ పంతులు, కొల్చారం మండలం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement