Silver Jewelry
-
కటకటాల్లో గజదొంగ నాయక్
హిమాయత్‌నగర్: భారీ చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగ సంతోష్‌నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 22.409 తులాల బంగారు ఆభరణాలు, 23.7 తులాల వెండి ఆభరణాలు, 11 విదేశీ కరెన్సీలు, 251 విదేశీ కరెన్సీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ రమణరెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.జానయ్య, నారాయణగూడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, డీఐ రవికుమార్‌లతో కలసి వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దొంగలింగాల గ్రామానికి చెందిన జతావత్ సంతోష్‌నాయక్ 15 ఏళ్ల ప్రాయంలోనే చోరీల బాట పట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఇతడిపై 29 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదన్నారు. జువైనల్ హోం నుంచి వచ్చాక కూడా చోరీలు చేశాడని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నారాయణగూడ పీఎస్ పరిధిలోని ఆయిల్‌సీడ్ కాలనీలో వైద్యుని ఇంట్లో ఇతని స్నేహితుడు విక్రమ్‌తో కలసి భారీ చోరీ చేశాడు. ఈ చోరీలో 50 తులాల బంగారు ఆభరణాలు, 3 వేల విదేశీ కరెన్సీ, కెమెరా, విలువైన వస్త్రాలు దొంగలించాడు. చోరీ అనంతరం నగరంలో రెండు రోజులున్న నాయక్ తిరుపతికి చేరాడు. విషయం పోలీసులకు తెలిసిందని గమనించిన నాయక్ వైజాగ్‌కు మకాం మార్చాడు. ఎట్టకేలకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాయక్‌ను అరెస్టు చేశారు. -
67 కిలోల వెండి నగలు స్వాధీనం
కాజీపేట: అక్రమంగా తరలిస్తున్న రూ.35 లక్షల విలువ చేసే 67 కిలోల వెండి ఆభరణాలను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సతీశ్, సుబ్రహ్మణ్యం సత్తివేలు వెండినగల వ్యాపారులు. వీరు మంగళవారం కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో కోర్బా ఎక్స్‌ప్రెస్ నుంచి దిగారు. వీరిని పోలీసులు తనిఖీ చేయగా, ఎటువంటి బిల్లులు లేకుండా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ నగలను జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలను ఐటీ శాఖకు అప్పగించనున్నట్లు ఏసీపీ బి. జనార్దన్ తెలిపారు. -
‘జువెలరీ’ దొంగలు అరెస్ట్
ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి నగలు స్వాధీనం దొడ్డబళ్లాపురం : 11 ప్రత్యేక కేసులకు సంబంధించి నెలమంగల పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.29 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు గ్రామీణ ఎస్పీ అమిత్ సింగ్, నెలమంగల డీవైఎస్పీ రాజేంద్రకుమార్ సోమవారం పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జువెలరీ షాపుకు కన్నం వేసిన కేసులో సుశాంత్, సిద్ధరాజు, జగదీష్, అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మూడు నెలల క్రితం కేఆర్ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీ బాలాజీ జువెలర్స్ అండ్ బ్యాంకర్స్ దుకాణానికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ద్వారా 14 మీటర్ల దూరం వరకూ సొరంగం తవ్వి 200 గ్రాముల బంగారు నగలు, 14 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశారు. నెలమంగల పరిధిలో వీరిని పట్టుకున్న పోలీసులు వారి నుండి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సునిల్‌కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఒక కారు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరు, బెంగళూరు గ్రామీణ పరిధిలో కార్లు, బైక్‌లు చోరీ చేసేవాడని పోలీసులు తెలిపారు. -
10 తులాల బంగారం అపహరణ
కరీంనగర్(వీనవంక): కరీంనగర్ జిల్లాలోని వీనవంక మండలంలోని గణుముక్కల గ్రామం నాగిడి శివారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 40 తులాల వెండి నగలను ఎత్తుకెళ్లారు. ఈ నగలను పడక గదిలోని గోడకు రంధ్రం చేసి అందులో భద్రపరిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎత్తుకెళ్లారు. తెలిసిన వాళ్లే చేసుంటారని అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం వచ్చిన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కడియాల కోసం కాళ్లు నరికారు
* మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళ దారుణ హత్య * 70 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు దేవరకద్ర, న్యూస్‌లైన్: ఆభరణాల కోసం దుండగులు ఓ మహిళ గొంతుకోసి కాళ్లు నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 70తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో గురువారంరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోలమ్మ (40) రాత్రి భోజనం చేసి ఇంటి ముందు మంచంపై పడుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేయడమేగాక. మోకాళ్ల వరకు నరికి వెండి కడియాలు, చేతులకు ఉన్న వెండి గాజులను ఎత్తుకెళ్లారు. మహబూబ్‌నగర్ ఓఎస్డీ జె.చెన్నయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. -
కోదండ రామాలయంలో భారీ చోరీ
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గల కోదండ రామాలయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రెండు పంచలోహ విగ్రహాలు, వెండి, తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనను నిరసిస్తూ.. ఆగ్రహించిన స్థానికులు, అఖిల పక్ష నేతలు ఆలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి దొంగలు గుడి తాళాలు, గర్భ గుడి షట్టర్‌తో పాటు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. పంచలోహ విగ్రహాలైన సీతమ్మ తల్లి, శ్రీకృష్ణుడు విగ్రహాలతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారు పుస్తెలు చోరీ చేశారు. అయితే ఈ భారీ చోరీని తెలుసుకున్న వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే ఇదే ఆలయంలో నాలుగుసార్లు చోరీ జరిగినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల వద్ద పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ వనజాదేవి, డీఎస్పీ గోద్రూ, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. స్పందించిన ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. కాగా ఆలయం చోరీ దృష్ట్యా స్థానికులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయించారు. ఆలయంలో క్లూస్‌టీం బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలను ఏబీవీపీ నేతలు మూసివేయించారు. సాయంత్రం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివాస్, టీ చంద్రపాల్, దుర్గ ప్రసాద్, కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ్, మల్కాజి సత్యనారాయణ, కొండశ్రీను, మ్యాడం బాలకృష్ణ, మధు, కాశీనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్, ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూచార్యులు, బ్రాహ్మణ సంఘం నేతలు వైద్య శ్రీనివాస్, కృష్ణమూర్తి, రాజు పంతులు, కృష్ణమూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, కృష్ణ పంతులు, కొల్చారం మండలం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.