తాండూరు, న్యూస్‌లైన్: తిరుమలేశుడి కల్యాణం జరిపించేందుకు వెళ్లిన ఓ వ్యాపారి ఇంట్లో దుండగులు తెగబడ్డారు. 13.3 తులాల బంగారు నగలు, నాలుగు కిలోల వెండితో పాటు రూ. 25 వేల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన శనివారం ఉదయం తాండూరు పట్టణంలో వెలుగుచూసింది. బాధితుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని యశోదనగర్‌లో నివాసం ఉంటున్న బెన్నూర్ కెళిగరి చంద్రయ్య భద్రేశ్వర్ చౌక్ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆయన చిన్న కొడుకు వివాహం జరిగింది. అనంతరం తిరుమల వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించేందుకు చంద్రయ్య కుటుంబంతో కలిసి ఈనెల 19 తిరుపతికి వెళ్లాడు. శనివారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో చంద్రయ్య ఇంటి తలుపు తెరిచి ఉంది. పొరుగింట్లో ఉండే ఆయన తమ్ముడు అశోక్ గమనించి చోరీ జరిగిందని అనుమానించి తన కొడుకు ప్రవీణ్‌కుమార్‌కు విషయం చెప్పాడు. ప్రవీణ్‌కుమార్ వెంటనే పట్టణంలో ఉండే తన పెదనాన్న బామ్మర్ది రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. రవీందర్ ఫిర్యాదుతో ఉదయం తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్, రూరల్ సీఐలు సుధీర్‌రెడ్డి, రవికుమార్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగలు ఇంటి ప్రధాన ద్వారం గొళ్లెం పగులకొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు.
ఇంట్లోని రెండు గదుల్లో ఉన్న మూడు బీరువాలు ధ్వంసం అయి ఉన్నాయి. దుస్తులు, ఇతర సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయ. దుండగులు బీరువాల్లో ఉన్న 10.3 తులాల బంగారు అభరణాలు, నాలుగు కిలోల వెండి, రూ. 25 వేల నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దొంగలు ఇంట్లో అణువణువు గాలించారు.పోలీసులు వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. డాగ్‌స్క్వాడ్ మొదట యశోదనగర్ పార్కు పక్కనే ఉన్న బచ్‌పన్ స్కూల్‌కు వెళ్లి ఆగింది. అనంతరం అంబేద్కర్ కళాశాల మార్గం మీదుగా ఐబీ అతిథి గృహం సమీపంలోని రైల్వే క్వార్టర్స్‌లోకి వెళ్లి మూడు ఇళ్లలోకి వెళ్లింది. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్ వరకు వెళ్లింది. దుండగులు చంద్రయ్య ఇంటి ఆవరణలోని చిన్న ట్యూబ్‌లైట్‌ను తొలగించారు. ఓ లుంగీతో పాటు కొన్ని దుస్తులను ఇంటి గేటు వద్ద పడేసి వెళ్లిపోయారు. పోలీసులు వ్యాపారి ఇంట్లో పడి ఉన్న కాల్చిన బీడి ముక్కతో పాటు చేతులకు వేసుకునే గ్లౌజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తమ చేతి వేలిముద్రలు లభించకుండా గ్లౌజ్‌లు ఉపయోగించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుపతిలో ఉన్న చంద్రయ్యకు చోరీ సమాచారాన్ని తెలియజేశారు. బంగారం, వెండి నగలతో పాటు నగదు విలువ రూ.7 లక్షలు ఉంటుందని పోలీసు లు అంచనా వేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. దీంతో పాటు పోలీసులు పాత నేరస్థుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చంద్రయ్య కుటుం బాన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లిన ఆటోలు, వాటి డ్రైవర్‌ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చంద్రయ్య కుటుంబం తిరుపతికి వెళ్లిన విషయం పక్కాగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి నివాసం ఉంది. రాత్రి పూట పోలీసులు సరిగా గస్తీ నిర్వహించకపోవడంతోనే చోరీ జరిగిందని పట్టణవాసులు మండిపడుతున్నారు. చంద్ర య్య బావమరిది రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అర్బన్ ఎస్‌ఐ రవి తెలిపారు.
తాండూరులో భారీ చోరీ
Published Sun, Dec 22 2013 12:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement