భారీ చోరీ | Massive theft in Vizianagaram | Sakshi
Sakshi News home page

భారీ చోరీ

Published Mon, Nov 3 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

భారీ చోరీ

భారీ చోరీ

విజయనగరం క్రైం: ఇంతవరకు తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు..నేడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటుండగానే దర్జాగా చోరీలకు  తెగబడుతున్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటి గోడకు ఆనుకుని ఉన్న మరో ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ  దొంగతనం జరిగింది. ఇటీవల జరిగిన రెండుభారీ దొంగతనాలు మరువక ముందే తాజాగా విజయనగరం పట్టణంలో మరో దొంగతనం  జరగడం పట్టణ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాన్సాస్ సంస్థ  కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ పొందిన పాకలపాటి  సత్యనారాయణరాజు(పీఎస్‌ఎన్.రాజు)  పట్టణంలోని కుసుమగజపతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య పార్వతమ్మ మొదటి అంతస్తులో ఉంటుండగా కిందన  ఆయన కార్యాలయం ఉంది. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ మొదటి అంతస్తులోని ఓ గదిలో నిద్రిస్తున్నారు.
 
 కిటికీలు అన్నీ తెరిచిఉన్నాయి. దొంగలు  కిటి కీ మెస్‌ను కత్తిరించి గడియను తీసి ప్రధాన ద్వారానికి ఉన్న సెంట్రల్ లాక్‌ను  స్క్రూలతో తొలగించి లోపలికి చొరబడ్డారు. పీఎస్‌ఎన్.రాజు పడుకున్న  గదికాకుండా పక్క గదిలో ఉన్న బీరువాలు, అలమరాల్లో ఉన్న బట్టలను చిందరవందరచేశారు. బీరువాలో ఉన్న రూ.40వేల నగదును అపహరించారు. ఆ తర్వాత దేవుడు గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న 55తులాల బంగారు అభరణాలు, 15కేజీల వెండి వస్తువులను అపహరించారు. ఆదివారం ఉదయం పీఎస్‌ఎన్.రాజు లేచి చూసేసరికితలుపులు తెరిచి ఉండడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సీఐ కె.రామారావు,  ఎస్సై బి.రమణయ్య సంఘటన స్థలానికి  చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల  నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీసీఎస్ ఎస్సై లక్ష్మణరావు వచ్చి పరిశీలించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.
 
 దర్జాగా మందు కొట్టిన దొంగలు..
  పీఎస్‌ఎన్ రాజు ఇంట్లో బీరువాలో ఉన్న  మద్యాన్ని  దొంగలు తీసుకుని రెండు గ్లాసుల్లో పోసుకుని ఫ్రిడ్జ్‌లోని కూలింగ్  వాటర్ తీసుకుని దాంట్లో  వేసుకుని దర్జాగా తాగినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. బంగారు అభరణాలు ఎక్కువగా ఉన్న దేవుడు గదిలో దొంగలు తెలివిగా నీరును చల్లి అనవాళ్లు లేకుండా చేశారు. గతంలో జరిగిన కొన్ని దొంగతనాల్లో ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగును తినడం, కూల్‌డ్రింక్‌లను తాగిన వంటి సంఘటనలు ఉన్నాయి.
 
 ఇంట్లో ఉంటుండగానే దొంగతనం..
 పీఎస్‌ఎన్.రాజు, భార్య  ఇంట్లో  పడుకుని ఉండగానే దొంగలు  చోరీకి పాల్పడడం విశేషం. ఎపుడు ఆలస్యంగా పడుకునే రాజు శనివారం రాత్రి 9గంటలకే నిద్రలోకి వెళ్లారు. మద్యలో శబ్దం వచ్చిన గాలికి కిటికీలు కదులుతున్నాయేమోనని భావించారు. దొంగలు రాజు పడుకునే గదిని మాత్రం  ముట్టలేదు.  ఆయన ప్రతిరోజు పడుకునే ముందు పిస్టల్ పక్కనే పెట్టుకుంటారు.
 
 క్లూస్ టీం పరిశీలన
 సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి  వేలి ముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్  బృందం సంఘటన స్థలానికి   చేరుకుని  దొంగలు వెళ్లిన ప్రాంతాలను పరిశీలించింది.  ఆ సమీపంలో ఉన్న  ప్రముఖ లాయర్ ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు ఇంటి వద్ద డాగ్ కాసేపు ఆగింది. దొంగలు అక్కడ కూడా రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement