తన వంటకాలతో గ్లోబల్‌గా అభిమానులను సంపాదిస్తున్న ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇకలేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని చలాకీగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగించిన మస్తానమ్మ ఇక సెలవంటూ కన్నుమూశారు. పసందైన వంటకాలతో యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందారు మస్తానమ్మ. అయితే గత ఆరు నెలలుగా కంట్రీ ఫుడ్స్ వెబ్‌సైట్ బామ్మ వంటకాల వీడియోలు లేక వెల వెల బోయింది. దీంత ప్రపంచంలోని ఆమె అభిమానులంతా ఆకలితో మలమలలాడినంతగా విలవిల్లాడిపోయారు. చివరకు ఆమె ఇక లేరన్న వార్త వారిని బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్‌సైట్‌లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్‌మా ’ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. (ఆ ఘుమఘుమలు ఇకలేవు)
అయితే ఇలా అర్ధాంతరంగా అందనంత దూరం వెళ్ళిపోయిన మస్తానమ్మకు అభిమానులు నివాళులు ప్రకటించారు. తన బామ్మ మస్తానమ్మ చిన్నప్పటినుండి తమ కుటుంబానికి ఎంతో చేదుడువాదోడుగా ఉండేదని ఆమె మనుమడు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. కష్టించి పనిచేసి చివరి శ్వాసవరకూ కుటుంబాన్ని ఆదుకున్న తమ పెద్దదిక్కు ఇలా అకస్మాత్తుగా తమను వీడిపోవడం తీరని లోటని కన్నీరు మున్నీరయ్యారు. వెజ్, నాన్ వెజ్ ఇలా ఏదైనా.. ఆమె వంటకాల వీడియోలు లక్షల వ్యూస్‌ను సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. బామ్మ అండతో తాను ప్రారంభించిన యూ ట్యూబ్ ఛానల్‌కు విశేష ఆదరణకు నోచుకుందన్నారు. 106 ఏళ్ళ వయసులో కూడా ఎంతో శ్రమకోర్చి యూట్యూబ్ వంటల వీడియోల ద్వారా ఆర్థికంగా ఎంతో సాయపడిన బామ్మ ఇలా ఒక్కసారిగా తమను వదిలి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment