మస్తానమ్మ (ఫైల్)
సాక్షి, తెనాలి: తన చేతివంటతో పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేపిన ‘గూగుల్’ బామ్మ ఇకలేరు. పంటచేల పక్కన సంప్రదాయ కట్టెల పొయ్యిలో గుడ్డు ఆమ్లెట్ నుంచి రొయ్యల వేపుడు వరకు, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు వరకు తన వంటకాల ఘుమఘుమలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వీక్షకుల నోరూరించిన ఆ అవ్వ కర్రె మస్తానమ్మ 107 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురై కన్నుమూసిన విషయం ఆలస్యంగా తెలియవచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడలోని తన స్వగృహంలో ఆమె ఆదివారం సాయంత్రం మృతిచెందారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేసినట్టు మనుమడు లక్ష్మణ్ తెలియజేశారు. (సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్)
మస్తానమ్మ సొంతూరు తెనాలి దగ్గర్లోని కోపల్లె. అత్తిల్లు సమీపగ్రామం గుడివాడ. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త నాగభూషణం చనిపోయారు. ఏకైక కుమారుడు ఇంట్లో ఉండే అవకాశమున్నా, అదే ఆవరణలో ఓ పాకలో నివసిస్తూ వచ్చారు. కాలూచేయీ ఆడేంతవరకూ ఒకరిపై ఆధారపడకూడదన్న భావనతో అన్ని పనులు స్వయంగా చేసుకుంటూ వచ్చారు. పొలం పనులు చేసే శక్తి సన్నగిల్లినా, పొలం వెళ్లటం మాత్రం మానలేదు. హైదరాబాద్‌లో వీడియో ఎడిటరైన ఆమె మనుమడు లక్ష్మణ్, తన స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి ఆమె వంటలను యూ ట్యూబ్ ద్వారా అందరికీ నేర్పించాలనుకున్నారు.
‘కంట్రీ ఫుడ్స్’ పేరుతో ఛానల్‌ను 2016 ఆగస్టులో ప్రారంభించారు. గుడ్డు ఆమ్లెట్ నుంచి మటన్ బిర్యానీ, చేపల పులుసు, పుచ్చకాయ చికెన్, రొయ్యల వేపుడు, పీతల కూర, గోంగూర చికెన్, వంకాయ మసాల, గుత్తివంకాయ వంటి వంటకాలకు సంబంధించిన 40 పైగా వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఈ ఛానల్‌కు 2.30 లక్షల సబ్‌స్క్రైబర్స్ వచ్చేశారు. మొత్తంమీద 43 మిలియన్లకు పైగా మస్తానమ్మ చేతివంటను వీక్షించారు. బీబీసీలోనూ రెండు నిముషాల కథనం ప్రసారమైందని మనుమడు లక్ష్మణ్ చెప్పారు. గూగుల్ సంచలమనయ్యాక 2017 ఏప్రిల్‌లో మస్తానమ్మ పుట్టినరోజును మనుమడు, బంధువులు ఘనంగా జరిపారు. వివిధ దేశాల సబ్‌స్కైబర్లు బహుమతులు, డబ్బును పంపారు.
Comments
Please login to add a commentAdd a comment