శ్రీకాకుళం కల్చరల్:ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ పరిసరాలను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పది కోట్ల రూపాయలతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. పనుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా విశాఖకు చెందిన దేవాదాయశాఖ ఏఈ సైదా, ప్రైవేటు కన్సల్టెంట్ భాస్కర్, ఆలయ ఈవో పుష్పనాథం, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు ఆలయ పరిసరాలను, కట్టడాలను ఆదివారం క్షుణ్ణంగా పరిశీంచారు.
ఆలయ ముందుభాగంలో రోడ్డును 60 అడుగుల మేర విస్తరించాల్సి ఉందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అలాగే స్వామి వారి ఇంద్రపుష్కరిణి ఆలయం నుంచి కనపడే విధంగా దారిని వెడల్పు చేయాల్సి ఉందని భావించారు. క్యూలైన్ల ఏర్పాటు కోసం ఇంద్రపుష్కరిణి పరిసరాలను, ఆలయానికి చెందిన తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పుష్పనాథం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన సూచనలు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాలను అభివృద్ధి పరచాల్సి ఉందన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు.
ఇందులో భాగంగా దేవాదాయశాఖ ఏఈ, కన్సల్టెంట్‌ను ఆలయ పరిసరాల పరిశీలన కోసం ఉన్నతాధికారులు పంపించారన్నారు. ఇంద్రపుష్కరిణి నుంచి మూడు అంచెలుగా క్యూలైన్ల నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. అలాగే ఉచిత, శాశ్వత క్యూలైన్లు, భక్తులు వేచి ఉండేందుకు 120 గదులు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఇంద్రపుష్కరిణి ఎడమ వైపు మార్గంలో కేశఖండశాలకు దగ్గరగా కూడా భక్తులు పుష్కరిణిలో దిగి స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కుడివైపు క్యూలైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. మధ్యలో ఉన్న రోడ్డు పైనుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. దీనికోసం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఉంటే వాటిని కొనుగోలు చేస్తామన్నారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా చెప్పుల స్టాండ్లు, టాయిలెట్లు నిర్మిస్తామని, వాహనాల పార్కింగ్‌ను గ్యాస్ గొడౌన్ వద్ద, శ్రీకాకుళం రోడ్డు వైపు ఉన్న స్వామి వారి తోటలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వివిధ నిర్మాణాలు, ప్రైవేటు ఆస్తుల కొనుగోలు కోసం సుమారు పది కోట్ల రూపాయలు అవసరం అవుతోందన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల ఆలయ పరిసరాల్లో నిర్మించిన వైజయంతి మండపాన్ని తొలగించేందుకు వెనుకాడమన్నారు. అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపిస్తామని, అక్కడ నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కన్సల్టెంట్ భాస్కర్, ఏఈ సైదాలు మాట్లాడుతూ ఉన్న స్థలం లభ్యత మేరకు ఏవిధంగా నిర్మాణాలు చేయాలో చూసి అవసరమైన చోట ప్రైవేటు స్థలం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామన్నారు.
అరసవల్లికి మహర్దశ
Published Mon, Mar 23 2015 4:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement