
మళ్లీ తెరపైకి మాడ వీధులు
తిరుమల తరహాలో ఏర్పాట్లు
కార్యరూపంలోకి రానున్న ప్రతిపాదనలు
కొండపై ఉన్న కార్యాలయాలు దిగువకు మార్చేందుకు సన్నాహాలు
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహాలో మాడ వీధుల నిర్మాణ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. కొండపై ఉన్న దేవస్థానం కార్యాలయాలను దిగువకు తర లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాడ వీధుల ఏర్పాటు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
విజయవాడ : తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా మాడ వీధులు నిర్మించాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. కొద్దికాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తెచ్చేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్టే అనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆలయ ఆవరణలోని దేవస్థానం కార్యాలయాలను కొండ దిగువన ఉన్న ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్ (జమ్మిదొడ్డి)లోకి మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కార్యాలయాలన్నింటినీ తొల గించి అక్కడ మాడ వీధులు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు దేవస్థాన విభాగాలు
ఇంద్రకీలాద్రిపై సుమారు 8వేల చదరపు అడుగుల్లో ఈవో కార్యాలయంతో పాటు స్టోర్స్, ప్రసాదాల తయారీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్, సమాచార కేంద్రం తదితర విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటినీ ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు కార్యాలయం, వీఐపీల కోసం నిర్మించిన సూట్లు, ఏసీ గదులు మార్చడం లేదు. రెండో అంతస్తుతో పాటు పైన తాత్కాలికంగా షెడ్లు వేసి విభాగాలన్నింటినీ తరలిస్తారని సమాచారం. ఆ తరువాత మరొక చోట స్థలం తీసుకుని శాశ్వత భవనం నిర్మిస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంద్రకీలాద్రిపై ఉన్న కార్యాలయ భవనాలను తొలగించి మాడ వీధులు నిర్మించాలని భావిస్తున్నారు.
మాడపాటి గెస్ట్‌హౌస్‌లో ఆరు సూట్లు
మాడపాటి గెస్ట్‌హౌస్‌లో 27రూములు ఉన్నా యి. పుష్కరాలకు వీవీఐపీలు వస్తే ప్రస్తుతం ఉన్న సూట్లు సరిపోవడం లేదు. అందువల్ల 12 రూములను ఆరుసూట్లుగా మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికోసం సుమారు రూ.50లక్షలతో ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేశారని, పనులు ఈ నెలాఖరులో ప్రారంభించాలని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
దుర్గమ్మ ఆలయానికి భద్రతెంత!?
ప్రస్తుతం అమ్మవారి ప్రధాన దేవాలయానికి వెనుక వైపు కార్యాలయ భవనాలు ఉన్నాయి. కొండ పక్కగా ఎప్పుడో కట్టిన ఈ భవనాలు అడ్డుగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి కొండచరియలు విరిగిపడలేదు. ఇప్పుడు ఈ భవనాలను పగలగొడితే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.