
ఎంబీఏ చదవలేక పోతున్నా..!
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం
కీసర, న్యూస్‌లైన్: ఓ ఎంబీఏ విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తిరుమల శెట్టి వేణుగోపాల్‌రావు, సుజాత దంపతులు. వీరి చిన్న కూతురు అనూష(23) చీర్యాల గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల్లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అనూష గతేడాది నగరంలోని ఓ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఎంబీఏ కోర్సు తనకు సంబంధం లేకపోవడంతో రాణించలేకపోతున్నానని ఆమె తరచూ స్నేహితులతో వాపోయేది.
ఈ క్రమంలో ఇటీవల జరిగిన మొదటి సెమిస్టర్‌లో కూడా అనూషకు తక్కువ మార్కులు వచ్చాయి. తాను ఎంబీఏ కోర్సు చదవలేకపోతున్నానని మానసిక వేదన గురవుతోంది. శుక్రవారం కళాశాలకు చేరుకున్న అనూష తరగతి గది నుంచి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌కు వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పింది. భవనం మొదటి అంతస్తు పెకైళ్లి కిందికి దూకింది. అనూష తలకు తీవ్రగాయాలై రెండు కాళ్లు విరిగిపోయాయి. గమనించిన కళాశాల సిబ్బంది ఆమెను ఈసీఐఎల్‌లోని తులసి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అనూష ఆత్మహత్యాయత్నానికి మానసిక ఒత్తిడే కారణమా.. లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.