సాక్షి, అమరావతి : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండో విడత ఎంబీబీస్ సీట్ల భర్తీ ఆగిపోయింది. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌లో అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ఆపాలని ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల ప్రకారమే సీట్ల భర్తీ పక్రియ కొనసాగించాలని సర్కారు పేర్కొంది. తొలి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 2వ తేదీనే పూర్తయింది. ఇక రెండో దశ ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దానికి బ్రేక్ పడింది. మొదటి దశలో సీట్లు పొందినవారు ఈనెల 11న కళాశాలల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కూడా రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఎలా చేయాలో కూడా ప్రభుత్వానికి తెలియదా అంటూ మండిపడుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే : ప్రస్తుత పరిణామాలకు సర్కారుదే పూర్తి బాధ్యత అని విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏడాదిగా కోర్టులో కౌంటరు దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ 2001లో జారీచేసిన జీవో నం.550 ప్రకారం జరుగుతోంది. ఈ జీవో ప్రకారం రిజర్వు కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో సీటు తీసుకుని, ఆ తర్వాత ఆ సీటు వదులుకుంటే ఆ సీటును మళ్లీ అదే కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేయాలి. ఉదాహరణకు 350 ర్యాంకు బీసీ–డి అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో రిమ్స్ ఒంగోలులో సీటు పొంది.. ఆ తర్వాత రిజర్వు కేటగిరీలో గుంటూరు మెడికల్ కళాశాలలో సీటు రాగా.. అప్పుడు ఆ అభ్యర్థి రిమ్స్ ఒంగోలు సీటును వదులుకున్నాడనుకుందాం. ఇప్పుడు ఒంగోలు రిమ్స్ సీటును బీసీ–డి అభ్యర్థితో భర్తీ చేయాల్సి ఉంటుంది. మెరిట్ ప్రకారమైతే 351 ర్యాంకర్‌తో ఆ సీటును భర్తీ చేయాల్సి ఉంటుందని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు చెబుతున్నారు.
కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
అయితే 550 జీవోపై 2017లో నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటహర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీలో వదులుకున్న రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడం సరికాదని, దీనిపై న్యాయం చేయాలని అభ్యర్థించారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు 2017 ఆగస్టు 30న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం అప్పట్లో సీట్లు భర్తీ చేశారు. ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ రజనీలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది రమేష్‌బాబు వాదనలు వినిపిస్తూ.. జీవో కారణంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం జీవో నం.550ని నిలిపివేసి, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతేగాకుండా ఆ జీవోకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లతో పాటు నీట్ కన్వీనర్‌ను ఆదేశించింది.
ఏడాది నుంచి కౌంటర్ దాఖలు చేయకుండా..
గతేడాది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. సర్కారు పట్టించుకోకపోవడంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి 2018లో కూడా కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే దీన్ని సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొలుసు పార్థసారథితో పాటు పలువురు నేతలు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, వైఎస్ చాన్స్‌లర్‌ను కలసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. అలాగే పలు బీసీ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా సీట్ల భర్తీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇటీవలే ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. గత ఏడాది హైకోర్టు చెప్పినప్పుడు కౌంటర్ దాఖలు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని అభ్యర్థులు వాపోతున్నారు.
తొలి దశ కౌన్సిలింగ్‌పై స్పష్టత రాలేదు
మొదటి దశ కౌన్సిలింగ్ పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్ మొదలు కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో కౌన్సిలింగ్ ఆపాలని సర్కారు ఆదేశించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారమే నడుచుకుంటాం. మొదటి విడత కౌన్సిలింగ్‌లో భర్తీ చేసిన సీట్లపై సర్కారు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. 2017లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాం. –డా.ఎస్.అప్పలనాయుడు, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
రెండో విడత రద్దు చేస్తే ఉపయోగమేంటి?
అవకతవకలు జరిగిన మొదటి విడత కౌన్సిలింగ్‌ను రద్దు చేయకుండా రెండో విడతను రద్దు చేస్తామనడంలో ఔచిత్యమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తొలి విడత కౌన్సిలింగ్‌ను తక్షణమే రద్దుచేసి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. యూనివర్సిటీ నిర్వాకం వల్ల 496 సీట్లు ఓపెన్ క్యాటగిరీకి వెళ్లాయన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే భర్తీ జరగాలి
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగాలి. ఓపెన్ కేటగిరీలో సీటు వదులుకున్న రిజర్వుడు అభ్యర్థి కేటగిరీకే మళ్లీ ఆ సీటు ఇవ్వాలనడం సరికాదు. జీవో నం.550 అమలు కారణంగా ఇప్పటి వరకూ 8 వేల మందికి పైగా ఓసీలు సీట్లను కోల్పోయారు. న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలి. 2010లో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్... ప్రతిభ కలిగిన అభ్యర్థులు నష్టపోకూడదని అన్నారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేస్తే కోర్టు ధిక్కరణ కింద అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. –జి.కరుణాకర్‌రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఓసీ సంక్షేమ సంఘం.
Published Sun, Jul 8 2018 7:12 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment