పాత పద్ధతిలోనే ఎంబీబీఎస్ సీట్లు!
* 60 : 40 దామాషాలోనే భర్తీ!
* ముంచుకొస్తున్న కౌన్సెలింగ్ గడువు
* ఇప్పటికీ కొలిక్కిరాని ఫీజుల విధానం
* విధాన నిర్ణయాలు వెల్లడించని రెండు రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది కూడా పాత పద్ధతిలోనే 60:40 దామాషాలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ, రెండు రాష్ట్రాలూ వాటి విధానాన్ని ప్రకటించకపోవడం చూస్తే ఇదే నిజమనిపిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ఉమ్మడిగా జరగాలి. రెండు రాష్ట్రాలూ కలసి విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, ఇప్పటివరకూ ఫీజులపై నిర్ణయం జరగలేదు. సీట్ల భర్తీపై ఎలాంటి విధానాన్ని అనుసరించాలో తేల్చలేదు.
వీటితోపాటు ఇతర విషయాలపైనా రెండు రాష్ట్రాలూ సమావేశమైన దాఖలాలు లేవు. పాత ఫీజులే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు యాజమాన్యాలతో చర్చిస్తున్నామని అంటోంది. ఇదంతా చూస్తుంటే పాత విధానంలోనే సీట్ల భర్తీ జరిగే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గాలు అంటున్నాయి. పాత పద్ధతి ప్రకారం ప్రైవేటు కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, 10 శాతం ‘బి’ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. అంటే ప్రభుత్వం చేతిలో 60 శాతం సీట్లు ఉంటాయి. మిగతా 40 శాతం సీట్లలో 25శాతం యాజమాన్య కోటాలో, 15 శాతం ప్రవాస భారతీయ (ఎన్నారై) కోటాలో భర్తీ చేస్తారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 30లోగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి మూడు దశల కౌన్సెలింగ్ పూర్తి కావాలి. లేదంటే మిగిలిన సీట్లు రద్దయిపోతాయి.
ఫీజులు పెంచాలంటున్న ప్రైవేటు యాజమాన్యాలు
సాధారణంగా రెండేళ్లకోసారి ఫీజులు పెంచాలి. 2010 తర్వాత ఇప్పటి వరకూ ఇది జరగలేదు. దాంతో తక్షణమే ఫీజులు పెంచాలని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయ కోటా మినహాయించి మిగతా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, కామన్ ఫీజులు నిర్ణయించాలని చెబుతున్నాయి. కామన్ ఫీజు ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఉండాలనేది యాజమాన్యాల అభిప్రాయం. ప్రవేశ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించినా అభ్యంతరం లేదని, అయితే ప్రస్తుతం ఏఎఫ్‌ఆర్‌సీ (అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) కనిష్టంగా రూ.3.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.3.75 లక్షలు ఉండాలని చెప్పడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నాయి. దీనిపై రెండు ప్రభుత్వాలూ ఎటూ తేల్చలేదు.
కామన్ ఫీజుతో కన్వీనర్ కోటా సీట్లు మాయం
యాజమాన్యాలు కోరినట్లుగా కామన్ ఫీజు నిర్ణయిస్తే కన్వీనర్ కోటా సీట్లు మాయమైపోతాయి. దీనివల్ల ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద చేరే విద్యార్థులు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. బి కేటగిరీ విద్యార్థులు 2.50 లక్షలు చెల్లిస్తున్నారు. కామన్ ఫీజులో రెండు కేటగిరీల విద్యార్థులూ రూ.3 లక్షలకు పైన చెల్లించాల్సి వస్తుంది.
యాజమాన్య కోటా.. ఓ పెద్ద మాయ!
మరోపక్క.. పాత పద్ధతిలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ అనేది పెద్ద మాయగా మారింది. సాధారణంగా యాజమాన్య, ఎన్నారై కోటాలోని 40 శాతం సీట్లకు ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేయాలి. కానీ అలా చేయకుండా చాలా కాలేజీల్లో ఒక్కో సీటును రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ అమ్ముకుంటున్నారు.