గజ్వేల్, న్యూస్‌లైన్: వ్యవసాయ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ శాఖ ద్వారా అందించే పథకాలన్నింటినీ ‘మీ-సేవ’తో అనుసంధానం చేస్తున్నారు. అక్రమాల నివారణే లక్ష్యంగా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇక నుంచి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంటల బీమా పొందాలంటే రైతులు తప్పనిసరిగా ‘మీ-సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే జిల్లాలో మొదటి విడతగా పంటల బీమాకు సంబంధిం చిన దరఖాస్తులు, ప్రీమియంను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే రబీ సీజన్‌లో మిగతా అంశాలన్నింటికీ ఇదే విధానం అమలుచేయనున్నారు.
ప్రతి సీజన్‌లో రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాల పంపిణీ, పంటల బీమా చెల్లింపు వ్యవసాయశాఖకు తలకుమించిన భారంగా మారుతున్నది. మరోవైపు అర్హులైన చాలామంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అందడంలేదు. రాజకీయాల జోక్యం ఫలితంగా ఇబ్బందులెదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయశాఖ అందించే ప్రధాన పథకాలన్నింటినీ ‘మీ-సేవ’తో అనుసంధానం చేసింది. జిల్లాలో మొదటి విడతగా పంటల బీమాకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు. జూలై 31వ తేదీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఉండగా గజ్వేల్ సబ్‌డివిజన్‌లోని 400మంది ‘మీ-సేవ’ ద్వారా ధరఖాస్తు అందజేయడంతోపాటు ప్రీమియంను చెల్లించారు. జిల్లామొత్తంగా వేలాదిమంది ‘మీ-సేవా’ ప్రీమియంను చెల్లించారు. మిగతా మూడు అంశాలను రబీ సీజన్ నుంచి అనుసంధానం చేయనున్నారు.
ఇదీ విధానం...
వ్యవసాయశాఖ సేవలకు సంబంధించి ‘మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే రైతులకు రశీదు అందజేస్తారు. వెంటనే ఆ వివరాలన్నీ సంబంధిత మండల వ్యవసాయాధికారికి వెబ్‌సైట్ ద్వారా చేరిపోతాయి. రశీదుతో వ్యవసాయాధికారిని సంప్రదిస్తే విత్తనాలు, ఎరువుల కోసం అతని భూ విస్తీర్ణాన్ని బట్టి టోకెన్ అందిస్తారు. దాంతో విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. అధునిక పరికరాలు, పంటల బీమా పొందాలంటే గతంలో బ్యాంకుల్లో డీడీ తీసి వ్యవసాయాధికారికి అందజేయాల్సి ఉండేది. కానీ కొత్త విధానంలో నేరుగా ప్రీమియంను ‘మీ-సేవా’ కేంద్రంలో చెల్లిస్తే చాలు ఆ పథకం వర్తిస్తుంది. ఈ సందర్భంగా రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.
‘మీ-సేవ’ .. రైతన్నకు తోవ
Published Tue, Aug 13 2013 5:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement