శస్త్ర చికిత్స గది కోసం.. సిగపట్లు
మందస: శస్త్ర చికిత్స గది(ఆపరేషన్ థియేటర్) కోసం ఇద్దరు వైద్యాధికారుల మధ్య నెలకొన్న వివాదం కుటుంబ సంక్షేమ ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలను విస్మయపరిచింది. గంటల తరబడి నిరీక్షించేలా చేసింది. మందస పీహెచ్‌సీ వైద్యాధికారిగా టి.పాపినాయుడు, అదే మండల పరిధిలో హరిపురం సీహెచ్‌ఎన్‌సీ ఎస్‌పీహెచ్‌వోగా దామోదర ప్రధాన్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా మండలంలోని మెజారిటీ గ్రామాలు హరిపురం సీహెచ్‌ఎన్‌సీకి దగ్గర్లో ఉన్నాయి.
ఆపరేషన్ థియేటర్ కూడా ఆ ఆస్పత్రిలోనే ఉంది. అయితే ఈ గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను మందస పీహెచ్‌సీ పరిధిలో చేర్చడంతో కు.ని., తదితర ఆపరేషన్ల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబ ర్‌లో సీతంపేట ఐటీడీఏలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన వైద్యాధికారుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు రాగా ఆపరేషన్ థియేటర్ ఉన్న హరిపురం సీహెచ్‌ఎన్‌సీలో కు.ని శస్త్ర చికిత్సలు చేయడానికి శాఖాపరమైన ఇబ్బందులున్నాయని వైద్యాధికారులు వివరించారు. దీనికి స్పందించి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మందస వైద్యాధికారిని డ్రాయింగ్ ఆఫీసర్‌గా నియమించాలని ఐటీడీఏ పీవో ను ఆదేశించారు.
ఆ మేరకు ఈ నెల 7వ తేదీన ఆదేశాలు వచ్చాయి. దీంతో హరి పురం సీహెచ్‌ఎన్‌సీలో కు.ని. శస్త్ర చికిత్సలు చేయించే ందుకు శుక్రవారరం 22 మంది మహిళలను తరలించారు. ఆపరేషన్ గది తాళా లు ఇవ్వాలని ఎస్‌పీహెచ్‌వో దామోదర ప్రధాన్‌ను కోరగా.. ‘అది నా పరిధిలోని థియేటర్, ఇచ్చేదిలేదని’ ఆయన అన్నారని పాపినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా వారిద్దరికీ వాగ్వాదం జరగడంతో శస్త్రచికిత్సల కోసం వచ్చిన మహిళలు సుమారు రెండు గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంత నచ్చజెప్పినా ప్రధాన్ అంగీకరించకపోవడంతో బలవంతంగా గది తెరిపించి ఆపరేషన్లు చేశామని పాపినాయుడు చెప్పారు. హరిపురం ఎస్‌పీహెచ్ వోను పదోన్నతిపై రిమ్స్ ప్రొఫెసర్‌గా బదిలీ చేసినా వెళ్లలేదని, డ్రాయింగ్ అథారిటీ తనకు ఇచ్చినా ఇంత వరకు బాధ్యతలు అప్పగించలేద ని పాపినాయుడు ఆరోపించారు.
కాగా ఎస్‌పీహెచ్‌వో దామోదర ప్రధాన్ మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ డ్రాయింగ్ అధికారిగా నియమితులైనట్లు తనకు కనీసం చెప్పలేదని, అలాగే కు.ని. శస్త్రచికిత్సలకు ఆపరేషన్ గది వాడుకుంటామని ముందుగా చెప్పకుండా హడావుడి సృష్టించడం సరికాదని అన్నారు. వైద్యాధికారుల వాగ్వాదంతో కిందిస్థాయి సిబ్బంది గందరగోళానికి గురయ్యారు.