వైద్య సీట్లకు గండం | Medical seats problems | Sakshi
Sakshi News home page

వైద్య సీట్లకు గండం

Published Mon, Apr 27 2015 3:24 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM

వైద్య సీట్లకు గండం - Sakshi

వైద్య సీట్లకు గండం

సిద్ధార్థలో సూపర్  స్పెషాలిటీ నిర్మాణం
బుట్టదాఖలైన మంత్రి, ఎంపీ ప్రతిపాదనలు  
అగమ్యగోచరంగా కళాశాల భవితవ్యం

 
లబ్బీపేట : కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. అలా ఉంది సిద్ధార్థ వైద్య కళాశాల పరిస్థితి. సూపర్ స్పెషాలిటీ విభాగాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై)లో రూ. 150 కోట్లు కేటాయిస్తే.. వాటితో నూతన భవనాలు నిర్మించకుండా ఉన్నవాటిని పడగొట్టి వాటి స్థానంలో కొత్త భవనాలు కట్టేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అదే జరిగితే ప్రస్తుతం సిద్ధార్థలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రద్దు కావడం తథ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంలో పార్లమెంటు సభ్యులు, ఆరోగ్యశాఖ మంత్రి సూచించిన ప్రతిపాదనలు కాదని, ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ఈ దుస్థితి తలెత్తిందంటున్నారు. అదే జరిగితే వైద్య కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...
గత ఏడాది ఆగస్టులో సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై ద్వారా రూ.150 కోట్లు కేటాయించింది.వాటితో నూతన భవనాలు చేపట్టడంతోపాటు వైద్య విద్యార్థులకు అవసరమైన పరికరాలు సమకూర్చాల్సి ఉంది. కొత్త భవనాల నిర్మాణ విషయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు, ఆ శాఖ మంత్రి, ఎంపీ రెండు వేర్వేరు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

మంత్రి, ఎంపీ చేసిన ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోని అధికారులు చివరికి తమ నిర్ణయం ప్రకారమే వైద్య కళాశాల భవనాలను పడగొట్టి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేయాలని నిర్ణయించడంతో పాటు రెండు రోజుల కిందట కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖకు డిజైన్‌లు పంపించినట్లు సమాచారం. దీంతో వైద్య కళాశాల భవిష్యత్తు ఏమిటని సీనియర్ ప్రొఫెసర్‌లు ఆవేదన చెందుతున్నారు.

ఉన్న సీట్లకే ముప్పు
ఇప్పటికే 150 ఎంబీబీఎస్ సీట్లుకు సంబంధించి సౌకర్యాలు లేవని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత ఏడాది పెంచిన 50 సీట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైద్య కళాశాల ముందు భాగాన్ని పడగొడితే ప్రిన్సిపాల్ చాంబర్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ విభాగం, గ్రంథాలయం, పెథాలజీ విభాగంతో పాటు వెద్యుల చందాలు రూ. 2 కోట్లతో నిర్మించిన ఏసీ లెక్చర్ హాల్‌ను కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఎంసీఐ నిబంధనల ప్రకారం ఏసీ లెక్చర్ హాల్, గ్రంథాలయం, పెథాలజీ డిపార్ట్‌మెంట్ లేనిదే సీట్లు ఇచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. అదే జరిగితే వైద్య కళాశాలలో సీట్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తామంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాలు అంటే ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదని అంటున్నారు.

కోట్లాది రూపాయల దుర్వినియోగం
ప్రస్తుతం వైద్య కళాశాలలో పడగొట్టాలని నిర్ణయించిన భవనాల విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుంది. వాటి లైఫ్‌టైమ్ 80 సంవత్సరాలు కాగా, నిర్మించి 30 సంవత్సరాలే అయింది. ప్రత్యామ్నాయ స్థలం ఉండగా అన్ని కోట్లు విలువ చేసే భవనాలు పడగొట్టాల్సిన అవసరమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

వాటిని పడగొట్టాలన్నా రూ. కోటికి పైగా వెచ్చించాల్సి వస్తుందని ఇంజినీరింగు అధికారులే చెబుతున్నారు. దీంతో నిధులు దుర్వినియోగం చేస్తూ వైద్య కళాశాల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నారని పలువురు సీనియర్ ప్రొఫెసర్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  పాలకులు స్పందించి సూపర్ బ్లాక్ నిర్మాణం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement