కురుపాం: నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతమండలాలైన గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాంలలో అరకొరగా వైద్య సిబ్బంది ఉండడంతో వైద్యసేవలు దుర్భరంగా ఉన్నాయని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం శాసనసభ క్వశ్చన్ అవర్‌లో ప్రశ్నించారు. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్యాధికారులు ఉండాల్సి ఉన్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా లేరని, దీంతో ఈ మధ్య పల్స్‌పోలియో చుక్కలు వికటించి 13 మంది గిరిజన చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యాధికారులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరకు క్షేత్రస్థాయి సిబ్బందే వైద్యసేవలు అందించడంతో చిన్నారులు ప్రాణాపాయస్థితి నుంచి బయట పడ్డారని తెలిపారు. అలాగే ఏజెన్సీలోని పీహెచ్‌సీలన్నింటిలోనూ సరైన సిబ్బంది, సదుపాయాలు లేక గిరిజనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు చేతుల్లో పెట్టు కుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని పీహెచ్‌సీలపై దృష్టిసారించి గిరిజన ప్రజలను ఆదుకోవాలని కోరారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందిస్తూ ఏజెన్సీలో వైద్యసేవలపై తప్పని సరిగా దృష్టి సారిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏజెన్సీలో వైద్య సేవలు దుర్భరం
Published Sat, Mar 28 2015 3:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement