విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ..
సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకి అదే ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది యాధృచ్చికమే అయినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ పరీక్షలకు కేటాయించడంతో ఇతర వైద్య సేవలను ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. దీంతో కోర్టుకు హాజరు పరచడానికి ముందు అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ ఆసుపత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ ఆర్‌ఎంఓ డాక్టర్ శోభ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు బీపీ, సుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్ట్ కోసం స్వాబ్ సేకరించారు. మిగిలిన ఆరుగురికి కూడా వైద్య పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా తనకు ఇటీవల పైల్స్ సర్జరీ జరిగిందని, కారులో ఉదయం నుంచి కూర్చొని ప్రయాణించడం వల్ల సర్జరీ జరిగిన చోట నొప్పిగా ఉందని అచ్చెన్నాయుడు చెప్పడంతో ప్రభుత్వాసుపత్రికి చెందిన సర్జన్ పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ సాధారణ స్థితిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. (చదవండి : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్)
రెండు ఎఫ్‌ఐఆర్‌లు..
► ఈఎస్‌ఐ స్కామ్‌లో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో అచ్చెన్నాయుడితో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని రీజినల్ ఆఫీసుకి తరలించారు.
► శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు వారందరినీ ప్రాథమికంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని సుమారు గంటసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం అచ్చెన్నాయుడు, రిటైర్డ్ డైరెక్టర్ చింతల కృష్ణప్ప రమేష్ కుమార్‌పై ఒక ఎఫ్‌ఐఆర్, మిగతా ఐదుగురు నిందితులు ఈటగాడి విజయకుమార్, జనార్థన్, ఇవన రమేష్‌బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోనెవెంకట సుబ్బారావుపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది.
ఏసీబీ అధికారులతో న్యాయవాదుల వాగ్వాదం
► ఏసీబీ రీజినల్ కార్యాలయంలో అచ్చెన్నాయుడుని కలిసేందుకు వచ్చిన న్యాయవాదులు ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను లోపలికి అనుమతించాలంటూ హడావుడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే బెయిల్ పిటిషన్ కాగితాలు లోపలకు తీసుకెళ్లి అచ్చెన్నాయుడితో సంతకాలు పెట్టించుకొని వచ్చి న్యాయవాదులకు అందజేశారు.
ఏం జరుగుతుందో చూద్దాం..
► లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూద్దాం.. అంటూ ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టైన అచ్చెన్నాయుడు గొల్లపూడిలోని ఏసీబీ రీజినల్ కార్యాలయం వద్ద మీడియా వద్ద ముక్తసరిగా వ్యాఖ్యానించారు. ఏసీబీ అధికారులు రమ్మన్నారని, అందువల్ల ఇక్కడికి వచ్చానని తెలిపారు. అధికారులు తనను ఇంతవరకు ప్రశ్నించలేదని, బయటకు వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment