ఆ మందులు కొంటే ‘మూర్ఛ’ ఖాయం
Published Thu, Feb 6 2014 2:32 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :నరాల బలహీనత, మూర్ఛ వంటి వ్యాధులతో బాధపడే వారు ఉపశమనం కోసం వాడే మందుల్లో నకిలీలు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఇలాంటి నకిలీ మందుల విక్రయం సాగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా మూర్ఛ నివారణకు వాడే ఎప్టోయిన్ అనే మందు బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎప్పటివరకు వాడవచ్చు (ఎక్స్‌పైరీ) వంటి వివరాలు లేకుండా జిల్లాలోని కొన్ని మందుల దుకాణాల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి కేసు ఒకటి తాడేపల్లిగూడెంలో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సవితృపేటకు చెందిన పర్నా రామకృష్ణ అనే వ్యక్తి 20 ఏళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనినుంచి ఉపశమనం కోసం 20 ఏళ్లుగా ఈ మందులను వాడుతున్నాడు.
ఆయనకు అలవాటున్న ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఫోర్టు గేట్ డ్రగ్ హౌస్‌లో ఈ మందులను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పాడు. ఇదిలావుంటే రెండునెలల క్రితం కొన్న ఎప్టోయిన్ మందుల్లోని ఒక సీసాపై తయారీ తేదీ, గడువు తేదీ లేదని ఆలస్యంగా గుర్తించాడు. అప్పటికే అందులోని మందును ఉపయోగించాడు. మరుసటి రోజు ప్రాణాపాయ స్థితికి చేరాడు. దీంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యసేవల అనంతరం స్థిమితపడ్డాడు. ఏ మందులు వాడావని వైద్యులు అడగ్గా, ఎప్టోరుున్ మందుల సీసాను చూపించాడు. దానిపై తయూరీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలేమీ లేకపోవడంతో అది నకిలీదై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో రామకృష్ణ తాను మందులు కొన్న ఫోర్ట్ గేట్ డ్రగ్ హౌస్‌కు వెళ్లి ఇదే విషయమై నిలదీశాడు. షాపు యజమాని సరైన సమాధానం చెప్పకపోవడంతో రామకృష్ణ ఈనెల 2న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తమ పరిధిలోది కాదని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించడంతో అతడు మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ రజితకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కల్యాణి, ఎ.బాలకృష్ణ ఫోర్టుగేట్ డ్రగ్ హౌస్‌లో తనిఖీలు చేశారు. ఎప్టోయిన్ మందు నమూనాలను సేకరించారు. వీటిని విజయవాడలోని డ్రగ్ కంట్రోల్ పరిశోధనా శాలకు పంపిస్తామని, పరీక్ష ఫలితాల అధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డ్రగ్
ఇన్‌స్పెక్టర్ కల్యాణి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు
ఎప్టోరుున్ పేరిట నకిలీ మందులను మార్కెట్‌లో విక్రరుుస్తున్నట్టు ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఒక బ్యాచ్‌కు సంబంధించి నమూనాలు సేకరించారు. ల్యాబ్ ఫలితాలను మాత్రం ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. తాడేపల్లిగూడెంలోని షాపుపై ఫిర్యా దు వచ్చిన నేపథ్యంలో పట్టణంలో ఫోర్టుగేట్ డ్రగ్స్‌హౌస్‌తోపాటు ఈ మందును హోల్‌సేల్‌గా విక్రయించే స్టాకిస్ట్, ఉప స్టాకిస్ట్ వద్దగల స్టాకును డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఎప్టోరుున్ మందులు అమ్మే దుకాణాలను సోదా చేశారు. ఫోర్టు గేట్ డ్రగ్స్ హౌస్ యజమానికి వివరణ కోరుతూ నోటీసులు ఇస్తామని కల్యాణి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
కొన్నారనలేం.. కొనలేదనలేం
నకిలీ మందు విక్రయంపై ఫోర్టుగేట్ డ్రగ్ హౌస్ యజమాని దేవతి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ మందును తాము విక్రయించామని గాని.. విక్రయించలేదని గాని చెప్పలేమని అన్నారు. అయితే, ఇలాంటి మందులను విక్రయించాల్సిన అగత్యం తమకు లేదన్నారు.
Advertisement