అగ్రగామి రాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చారు | Mekapati Raja mohan reddy takes on congress party | Sakshi
Sakshi News home page

అగ్రగామి రాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చారు

Published Wed, Aug 27 2014 3:14 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

అగ్రగామి రాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చారు - Sakshi

అగ్రగామి రాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చారు

నాయుడుపేటటౌన్: దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్న ఆంధ్రరాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చే పరిస్థితిని ఢిల్లీ పెద్దలు తీసుకొచ్చారని  వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నా రు. నాయుడుపేటలో ఓడూరు నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టినా వారు అనుకున్న లక్ష్యంనెరవేరలేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ స్వయంగా అంగీకరించారన్నారు.
 
టీడీపీ పాలనలో దౌర్జన్యాలు : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరుగుతున్నాయని ఎంపీ ఘాటుగా విమర్శించారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  శాంతిభద్రతలపై చర్చించాలని అసెంబ్లీలో కోరగా తాతముత్తాతల కాలంలో జరిగిన ఘటనలను ప్రస్తావించి పక్కదారి మళ్లించడం పద్ధతి కాదన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని ఎంపీ మేకపాటి హెచ్చరించారు.
 
ప్రజల సంక్షేమం కోసం కేంద్రానికి సహకరిస్తాం :  ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిని తప్పక అడ్డుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు. ఎంపీ వెంట పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేరిగ మురళీధర్, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా స్టీరింగ్ క మిటీ సభ్యులు వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు చేవూరు వెంకటరామిరెడ్డి, ఓడూరు బాలకృష్ణరెడ్డి ఉన్నారు.
 
పథకాలన్నీ అమలైతేనే దేశాభివృద్ధి :
సూళ్లూరుపేట: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు చేస్తే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడవచ్చని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా గత 20 ఏళ్లుగా వింటున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే తాను ప్రకటించిన పథకాలను ప్రధాని అమలు చేయాలన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు దబ్బల రాజారెడ్డి కుమారుడి నిశ్చితార్థానికి రాలేకపోవడంతో మంగళవారం ఎంపీ పట్టణానికి వచ్చి దబ్బలను పలకరించారు. దబ్బల రాజారెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని ప్రకటించిన పథకాల్లో ఈ నెల 28న ప్రారంభించనున్న జన-ధన యోజన పథకం దేశంలో మారుమూల ప్రాంతాల వారికి బ్యాంక్ ఖాతా తెరుస్తారన్నారు.
 
ఈ పథకం మంచిదన్నారు. వచ్చే నెల 11న జనతాపార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. 2019 నాటికి భారతదేశంలో కేరళ రాష్ర్ట తరహాలో ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు తాగునీటి వసతిని ఏర్పాటు చేయడానికి కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పనులన్నీ 2019 నాటికి పూర్తయితే  భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీపీ షేక్ షమీ మ్, వార్డు కౌన్సిలర్లు పేర్నాటి దశయ్య, కలిశెట్టి బాబు, ఉమ్మిటి జానకీరామ్, ఇలుపూరు సుధాకర్, నలుబోయిన రాజసులోచనమ్మ, కళత్తూరు శేఖర్‌రెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి, గోగుల తిరుపాల్, ముత్తుకూరు రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement