సమైక్య త్యాగంసమైక్య త్యాగం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా
Published Tue, Aug 6 2013 4:18 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM
నమ్మిన సిద్ధాంతానికి, నైతిక విలువలకు కట్టుబడి పదవిని తృణప్రాయంగా త్యజించడంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు సోమవారం స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు ఫాక్స్‌ద్వారా పంపారు. జిల్లా ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా పదవిని త్యజించేందుకు సిద్ధపడ్డారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరంచోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లో మహానేత పేరును చేర్చడాన్ని నిరసిస్తూ 2011 ఆగస్టు 24వ తేదీన తన పదవికి రాజీనామా సమర్పించారు. అప్పట్లో రాజీనామాను ఆమోదించడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ వ్యవధిలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టేనా అని ఎంపీకి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ విషయంలో తనకు మరో అభిప్రాయం లేదని ఆయన కచ్చితమైన నిర్ణయం వెల్లడించారు. చివరిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 28న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేరుగా రాజమోహన్‌రెడ్డితో రాజీనామాపై తుది నిర్ణయం కోరారు.
అప్పుడు కూడా తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడంతో అదే రోజు ఆమోదించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అదే ఏడాది జూలై 12న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా సంచలన విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనలో అనుసరించిన వైఖరికి నిరసనగా రాజీనామా ప్రకటించారు. ఆయన రెండు సార్లు రాజీనామా చేయాల్సి వచ్చిన సందర్భం ఆగస్టు మాసం కావడం యాదృశ్చికం.
Advertisement
Advertisement