
సాక్షి, అమరావతి : పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని.. ఇందుకు సంబంధించిన బిల్లుకు గుంటూరు వాసిగా మద్దతు తెలుపుతున్నానని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు చక్కటి పునాది ఏర్పడుతుంది. ప్రభుత్వ సంస్కరణలు, నిర్ణయాలను విమర్శకులు కూడా స్వాగతిస్తున్నారు. వర్గం, కులం, పార్టీలు చూడకుండా.. వివక్ష చూపకుండా ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం గొప్ప విషయం. భవిష్యత్తులో గొప్ప అభివృద్ధి సాధించాలంటే మొదట ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలి. అలా జరగాలంటే అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలి.
గొప్ప నిర్ణయాన్ని అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో మేలిమలుపు అవుతుంది. మా ప్రభుత్వం ఏడు నెలల కాలంలోనే 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా మేలు చేసింది.. 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా అందించింది.. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేతలు.. ఇలా అందరినీ ఆదుకుంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించింది ఈ ప్రభుత్వమే. ఇది చాలా గొప్ప విషయం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎక్కడా రైతులకు, రైతు కూలీలకు కష్టం, నష్టం జరగకుండా చూస్తున్నాం’’ అని సుచరిత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment