
సాక్షి, గుంటూరు: అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసి రాద్దాంతం చేయటం తెలుగుదేశం పార్టీ వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలోని గోడ వివాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం వారికే చెల్లిందన్నారు. అది ఒక చిన్న గ్రామ సమస్యని, దాన్ని కూడా టీడీపీ నేతలు అనుకూలంగా మార్చుకోవడం దౌర్భాగ్యమన్నారు. గుంటూరులో జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత...ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నామన్నారు.
జిల్లాలోని సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అదేవిధంగా గత అయిదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుబడిందని విమర్శించారు. పొనుగుపాడులోని గోడ వివాదం ఒక గ్రామ సమస్య అని తెలిపారు. దీనిపై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలో గ్రామ సమస్యను.. టీడీపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే ముందుగానే అక్కడ 144 సెక‌్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీంతోపాటు గ్రామంలోని గోడ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment