మది గెలిచిన పెద్దాయన | Memories Of YSR | Sakshi
Sakshi News home page

మది గెలిచిన పెద్దాయన

Published Sun, Sep 2 2018 11:49 AM | Last Updated on Sun, Sep 2 2018 11:49 AM

Memories Of YSR - Sakshi

రాజన్న పాలనలో జిల్లా దశ మారిపోయింది. అభివృద్ధి అంటే ఇది అనే రీతిలో సింహపురి ప్రగతి పథంలో దూసుకుపోయింది. సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలనకు నిర్వచనంగా నిలిచి ప్రజల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. పారిశ్రామికంగా జిల్లాకు కొత్త ఊపు తెచ్చారు. కృష్ణపట్నం పోర్టు, మేనకూరు, మాంబట్టు, శ్రీసిటీ సెజ్‌ల ఏర్పాటుకు బీజం వేసి పారిశ్రామిక కారిడార్‌గా మార్చేశారు. 2004 నుంచి 2009 సంవత్సరం ఒక స్వర్ణయుగంగా నిలిచింది. ఐదేళ్ల కాలంలో 22 సార్లు రాజన్న జిల్లాలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారీ వరాల జల్లు కురిపించారు. అంతే కాదు అమలు చేసిన ఘనత కూడా మహానేతదే. జలయజ్ఞంతో జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మాణంలోకి రావడం, కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తయి సాగు విస్తీర్ణం పెరగడం జలప్రదాతతోనే సాధ్యమైంది. రాజకీయంగా జిల్లాలోని అనేక మంది నేతలకు మార్గదర్శకుడిగా నిలిచి ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా మలిచారు. ప్రజల మనస్సులు గెలుచుకున్న దివంగత ముఖ్యమంత్రి మనకు దూరమై ఆదివారానికి తొమ్మిదేళ్లు గడుస్తోంది. ఈ క్రమంలో జిల్లాతో మహానేత అనుబంధం, జరిగిన మేలును ఒకసారి పరిశీలిస్తే..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జన హృదయనేత ౖవైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో నెల్లూరు మున్సిపాలిటీ కార్పోరేషన్‌గా హోదా పొందింది. 2000కు ముందు వరకు మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరును  ప్రజాప్రతినిధుల వినతి మేరకు నగరపాలక సంస్థగా మార్చారు వైఎస్సార్‌. నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 1884 నుంచి మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరుకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్రమంలో 2004లో ప్రజాప్రతినిధులు అడిగిందే తడువుగా కార్పొరేషన్‌గా స్థాయిని పెంచారు. ఆయన మరణానంతరం నెల్లూరు కార్పొరేషన్‌ భవనానికి ఆయన పేరే పెట్టి నేతలు మహానేతపై అభిమానం చాటుకున్నారు. 

వీఎస్‌యూతో విద్యా వెలుగులు
జిల్లాలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా విద్యా వెలుగులు తీసుకొచ్చారు. 2008 జూలై 14న వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని ఏర్పాటు చేశారు. జూలై 28న కొత్తగా వర్సిటీకి వీసీని నియమించారు. ఆగస్టులో ఆరు కోర్సులతో నూతనంగా విక్రమ సింహపురి వర్సిటీని ప్రారంభించారు. వర్సిటీకి రూ.25 కోట్లు నిధులను విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్‌ పోస్టులు, 33 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాకుటూరులో నిర్మించిన నూతన భవనంలో 17 కోర్సులతో వర్సిటీని నిర్వహిస్తున్నారు.

మాంబట్టు నుంచి శ్రీసిటీ వరకు 
జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయించి భూముల ధరలకు రెక్కలు తెప్పించిన ఘనత మహానేత వైఎస్సార్‌కే చెందుతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం మాంబట్టు సెజ్‌ను వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 2006లో భూకేటాయింపులు పూర్తయి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదగానే శంకుస్థాపన జరుపుకొంది. ఏడాది పూర్తి కాగానే 2007లో పరిశ్రమల ప్రారంభోత్సవాలు జరిగాయి. ప్రస్తుతం పదిహేను కంపెనీల్లో 14 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌కు 2007లో శంకుస్థాపన చేసి 2008లో ప్రారంభించారు. ఈ సెజ్‌లోని పది కంపెనీల్లో ప్రస్తుతం 7 వేల మంది వరకు పనిచేస్తున్నారు. చివరగా తడ మండలం, చిత్తూరు జిల్లా సరిహద్దులో శ్రీసిటీని ఏర్పాటు చేశారు.  2008లో శ్రీసిటీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. అయితే దురదృష్టవశాత్తు మహానేత వారం రోజుల ముందే మరణించారు. తదానంతర క్రమంలో శ్రీసిటీ ప్రారంభమైంది. 12వేల ఎకరాల్లో శ్రీసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో 7,500 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 100కు పైగా కంపెనీలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. 60 నుంచి 70 వేల మంది పనిచేస్తున్నారు.

కృష్ణపట్నం పోర్టు ద్వారా ప్రగతి 
జిల్లాలో కృష్ణపట్నం పోర్టు మొదలు సెజ్‌ నిర్మాణం వరకు అన్ని వైఎస్సార్‌ హయాంలో జరిగినవే. ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేయాలన్న తలంపుతో నాటి సీఎం చంద్రబాబు 1996లో ఈ పోర్టును నాట్కో సంస్థకు అప్పగించారు. ఆయన పాలనలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పోర్టును నవయుగ సంస్థకు అప్పగించి పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకుని ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయించారు.  2008 జూలై 17న నాటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో కలిసి వైఎస్సార్‌ పోర్టును ప్రారంభించారు. పోర్టు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో జిల్లా కేంద్ర బిందువు అయింది.

సోమశిల, సర్వముఖి, సంగం బ్యారేజ్‌ల అభివృద్ధి 
జలయజ్ఞం ప్రాజెక్ట్‌లో భాగంగా సర్వముఖిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. సోమశిల రిజర్వాయర్‌ నీటి సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. పెన్నా డెల్టా ఆధునీకరణకు సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన చేశారు. మెట్ట ప్రాంతాలకు పంపింగ్‌ స్కీం ద్వారా తాగు, సాగునీరు అందించే హైలెవల్‌ కెనాల్‌కు రూ.1000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది వైఎస్సార్‌ హయంలోనే. 

జగనన్న రాకతో బాగు పడ్డాం
ముత్తుకూరు: దొరువులపాళెం పంచాయతీలోని రొయ్యలపాళేనికి చెందిన నెల్లిపూడి వెంకటయ్య వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. రాజన్న తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా 2010 నవంబరు 2న దొరువులపాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దను పొగొట్టుకుని తీవ్ర విచారంలో ఉన్న వెంకటయ్య భార్య మస్తానమ్మ, కూతురు విజయను జగన్‌ ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఆర్థిక సాయం చేశారు. జగనన్న  సాయంతో బాగుపడ్డామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ నెల్లిపూడి మస్తానమ్మ చెప్పింది. అంగడి నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement