అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వజనాస్పత్రిలోని గైనిక్, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వజనాస్పత్రిలోని గైనిక్, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 10.30 గంటలకు పునరుద్ధరించారు. ప్యానల్ బోర్డులోని కేబుల్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీన్ని మార్చడానికి రూ.50 వేలు ఖర్చవుతుందని వారు పేర్కొంటున్నారు.
దీన్ని గుర్తించడానికే సిబ్బందికి చాలా సమయం పట్టిందని రోగులు వాపోతున్నారు. వార్డుల్లో పది గంటలపాటు కరెంటు లేకపోవడంతో రోగులు, సహాయకులు చీకట్లోనే రాత్రి భోజనాలు చేశారు. ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. నెబులైజేషన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. బ్లడ్‌బ్యాంక్‌లోని రక్తం చెడిపోతుందేమోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.