నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : రెండు, మూడు మండలాల బాధ్యతలను ఒక్కరికే అప్పగించారు. దీంతో పాఠశాలలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కరువైంది. కొన్ని చోట్ల టీచర్లు క్రమ శిక్షణ తప్పుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రభావం విద్యాబోధనపై పడుతోంది. జిల్లాలో 1,536 ప్రాథమిక, 263 ప్రాథమికోన్నత, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సమారు 10 వేల మంది టీచర్లు ఉన్నారు. 1,132 మంది విద్యావాలంటీర్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఒక్క గాంధారి మండలానికి మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. మిగతా మండలాలకు ఇన్‌చార్జి ఎంఈఓలు కొనసాగుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సంబంధిత పాఠశాలల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయుణ్ణి ఆయా మండలానికి ఇన్‌చార్జ్ ఎంఈఓగా నియమిస్తున్నారు. కొందరు ఈ బాధ్యతల్లో పదవీ విరమణ కూడా చేశారు. జిల్లాలో ముగ్గురు ఉప విద్యాధికారులు ఉండాల్సి ఉండగా, నిజామాబాద్‌కు మాత్రమే సత్యనారాయణరెడ్డి రెగ్యులర్ అధికారిగా ఉన్నారు. బోధన్, కామారెడ్డిలకు ఇన్‌చార్జులే బాధ్యతలు వహిస్తున్నారు.
అందుకే నిర్లక్ష్యం
సహోద్యోగులే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నందున చాలా చోట్ల ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్య వైఖరి ఏర్పడింది. అక్టోబర్‌లో డిచ్‌పల్లి మండలం ధర్మారం పాఠశాలలో టీచర్లు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. పరిమితులు దాటి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో విద్యాశాఖ అధికారులు ఒకేసారి నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ పాఠశాలలో టీచర్లు రెండుసార్లు గొడవలకు దిగారు. పోలీసు కేసులు కూడా నమో దయ్యాయి. ధర్పల్లి, సిరికొండ మండలాలలోనూ ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. ఇన్‌చార్జి ఎంఈఓలు పాఠశాలలను సరిగ్గా తనిఖీ చేయలేకపోతున్నారని, విద్యాబోధనను పరిశీలించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి వీరికి కార్యాలయ సంబంధిత పనులు, ఆర్వీఎం నుంచి విద్యాసంబంధిత సర్వేలు, శిక్షణ కార్యక్రమలు, మధ్యాహ్న భోజనం, పాఠశాలలకు మరమ్మతులు, నిర్మాణాల వంటి పనులు ఉంటాయి. అంతేగాకుండా ప్రభుత్వం నిర్వహించే పలు సమావేశాలకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది.ఈ పనులతో తలమునకలయ్యే ఎంఈఓలు పాఠశాలల్లో విద్యాబోధన తీరును పరిశీలించలేకపోతున్నారని అంటున్నారు.
ఫలితాలపై ప్రభావం
ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 36 వేల మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ పాఠశాలలలో 17,327 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులను తీర్చిదిద్డాల్సిన వ్యవస్థ ఇన్‌చార్జుల పాలనలో దెబ్బతింటోంది. గతంలో ఎస్సెస్సీ ఫలి తాల్లో రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లా .. ఆ తర్వాత రెండుసార్లు 20వ స్థానం, 18 స్థానంలోకి దిగిపోయింది. మరి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటాయోననే చర్చ విద్యావర్గాల్లో నెలకొంది.
ఇన్‌చార్జులతో ఇబ్బంది ఉండదు
జిల్లాలో ఎక్కువగా ఇన్‌చార్జి ఎంఈఓలు ఉన్నారు. అయినా ఇబ్బంది లేదు. ఖాళీలు ఉన్న చోట అర్హత గల సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జి బాధ్యతలు అ ప్పగించాము. వారు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఈ ఏడాది ఎస్సెస్సీ ఫలితాలపై ఎలాంటి ప్రభావం లేకుండా చూస్తున్నాం.
- శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి
ఒక్కరే ఎంఈఓ
Published Thu, Dec 12 2013 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement