తణుకు/తణుకు అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్‌పాలసీ మద్యం వ్యాపారుల్లో గుబులు పుట్టిస్తోంది. నిబంధనలు కఠినతరం చేయడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు. రెండేళ్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధనతో పాటు ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లోని అత్యధికంగా అమ్మకాలు జరిపే దుకాణాలను తన వద్ద ఉంచుకోవడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లెసైన్‌స ఈ నెలాఖరుతో ముగియనుండగా జులై 1 నుంచి నూతన పాలసీ ప్రకారం కొత్త షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణకు అధికారులు తెరతీశారు. తొలుత స్పందన అంతంతమాత్రంగానే ఉన్నా శుక్రవారం భారీగానే దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది కొత్తవారు కావడం గమనార్హం.
జిల్లాలో 428 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించనుండగా వీటిలో పది శాతం షాపులను మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదిలా ఉంటే నూతన పాలసీ, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటుతో ఇకపై తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు, లెసైన్సు ఫీజులు, అద్దెలు పెరిగిపోవడంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు కొత్త దుకాణాల ఏర్పాటుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గతంలో దరఖాస్తుతో పాటు కేవలం పాన్ ఖాతా నంబర్ పేర్కొనే నిబంధన సడలించి ఐటీ రిటర్న్స్ సమర్పించాలని కోరుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గతంలో రూ. 25 వేలు ఉన్న నాన్ రిఫండబుల్ (తిరిగిరానిది) ప్రస్తుతం గ్రామాల్లో రూ.30 వేలు, పట్టణాల్లో రూ.40 వేలు, కార్పొరేషన్‌లో రూ. 50 వేలు నిబంధన కూడా ఇబ్బందిగానే మారింది.
సర్కారీ నిర్ణయం ఫలితాలనిచ్చేనా?
మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఎమ్మార్పీకే అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల నిర్వహణ విధానం ప్రైవేట్ షాపులను ప్రోత్సహించేలా ఉంటే ఫలితం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇలాంటి విధానం అమలు చేశారు. అయితే కేవలం చీప్ లిక్కర్‌కు సంబంధించిన నిల్వలు మాత్రమే అందుబాటులో ఉండటంతో పాటు అధిక ధరలున్న మద్యం నిల్వలు ఉండేవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధానం ఫలితాలు ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘మత్తు’ దిగుతోంది..!
Published Sat, Jun 27 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement