‘ఆహార భద్రత’పై సెమినార్‌లో వక్తలు
పౌష్టికాహార లోపమే బడుగులకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: పేదలకు బియ్యం ఇవ్వడంతోనే ఆహార భద్రత కల్పించినట్టు కాదని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. పౌష్టికాహార లోపమే బడుగులకు ప్రాణాంతకంగా మారిందని పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తులు పెంచకుండా ఆహార భద్రతను ముందుకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్నదని విశ్లేషించారు. జాతీయ పౌర పాలన విభాగం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ప్రాంతీయ కార్యాలయం బుధవారమిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో ‘ఆహార భద్రత-సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించింది. ఇందులో పలువురు ఐఏఎస్ అధికారులు మాట్లాడారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రశాంత మహాపాత్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికీ అనేకమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, వారికి సరైన ఆహారాన్ని అందించాల్సిన అవసరముందని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నా పేదల జీవితాల్లో పెద్దగా మార్పు రావడం లేదన్న జాతీయ గణాంకాలను ప్రస్తావించారు.
ఆహార భద్రతకు తోడ్పాటునిచ్చేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వినియోగదారుడు, వ్యవసాయదారుడికి ఉపయుక్తమైన విధానాలు అమలు జరగాలన్నారు. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరముందని, అప్పుడే రైతు ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తున్నారని, మనదేశంలోనూ ఇది అమలు జరగాలని పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అవినీతికి కళ్లెం వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎ.బాబు సూచించారు. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే ఆహార భద్రత మంచి ఫలితాలనిస్తుందని ప్రొఫెసర్ గోపాలాచారి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ, పౌరసరఫరాల విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.