రాజోలు ‘దేశం’లో రగడ | messed up telugu desam party ranges | Sakshi
Sakshi News home page

రాజోలు ‘దేశం’లో రగడ

Published Mon, Jan 6 2014 12:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

messed up telugu desam party ranges

 సాక్షి ప్రతినిధి, రాజోలు : కలసికట్టుగా పోరాడాల్సిన దళపతులు తమలో తామే కలహించుకుంటే.. ఆ సైన్యం పరిస్థితి ఎలా ఉం టుందో అలాగే ఉంది రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణుల పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల రామును పక్కన బెట్టి గతంలో అమలాపురం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసిన ఓటమి పాలైన గేదెల వరలక్ష్మిని బరిలోకి దింపాలనుకుంటున్నారని, రాము పోటీ చేస్తే డిపాజిట్ కూడా కష్టమేననే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చి తమ నాయ కునికి పొగపెడుతున్నారని ఆయన అనుయాయులు అంటున్నారు.

వరలక్ష్మితో ఈసారి రాజోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని ప్రతిపాదిస్తున్న వారిపై అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. రాము కంటే వరలక్ష్మి మెరుగైన అభ్యర్థి ఎలా అవుతారో స్పష్టం చేయాలంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్న తరుణంలో శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు రాజోలు రాజకీయాల్లో జోక్యం చేసుకుని కొత్తచిచ్చు రాజేశారని మండిపడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు.. కొత్తగా కాంగ్రెస్‌కు చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు టీడీపీలోకి వస్తారనే ప్రచారం తోడై పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోంది.

 నియోజకవర్గ ఇన్‌చార్జి రాము వచ్చే సారి కూడా సీటు తనదేనే భరోసాతో కొంతకాలంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా కష్ట, నష్టాలు ఎదుర్కొని పార్టీని భుజానమోస్తున్న తమ నేతను కాదని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరలక్ష్మిని ఎలా ప్రతిపాదిస్తారని రాము వర్గీయులు జిల్లా నాయకత్వం ఎదుటే తేల్చుకోవాలనుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టు ఉంటున్న వారిని ఆహ్వానించి, అందలమెక్కించాలనుకుంటే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని రాము, రాజోలు మాజీ జెడ్పీటీసీ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు.
 ఆ భేటీతో భగ్గుమన్న రాము వర్గీయులు
 ఇటీవల పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ముదునూరి వేణుగోపాలకృష్ణంరాజు(చినబాబు) ఆధ్వర్యంలో వరలక్ష్మి, బిక్కిన రామం తదితరులు తునిలో యనమలతో భేటీ అయ్యారు. ఆ భేటీ తరువాత నియోజకవర్గ టిక్కెట్టుపై భరోసా లభించిందంటూ వరలక్ష్మి అనుచరులు ఇంటింటా ప్రచారం చేసుకోవడాన్ని రాము వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సజావుగా ఉన్న పార్టీలో యనమల చిచ్చురేపారంటూ నిప్పులు చెరుగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వరలక్ష్మి టిక్కెట్టు ఆశించడంలో తప్పేంటని ఆమె వర్గం ప్రశ్నిస్తోంది.

నియోజకవర్గంలో మెజార్టీ నేతల మద్దతుతో టిక్కెట్టు తమదేనని ఆమె వర్గీయులు ధీమాతో ఉన్నారు. రాముకు అంత పట్టు లేదనే అభిప్రాయంతో చినబాబు, బిక్కిన రామంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎ.వి.సూర్యనారాయణరాజు తదితరులు వరలక్ష్మికి మద్దతిస్తున్నారనే ప్రచారం రాము వర్గీయులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఈ పరిణామాలన్నింటికీ చెక్ పెట్టేందుకా అన్నట్టు రాము ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం వేగాన్ని పెంచారు.
 రాపాకపై లోకేష్ సర్వే!
 ఈ తలపోట్లు చాలవన్నట్టు అక్కడి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ త్వరలో ‘సైకిల్’ ఎక్కనున్నారనే ప్రచారంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమైపోవడంతో రాపాక టీడీపీలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రాపాక విషయమై పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ కూడా చేసినట్టు సమాచారం. అసెంబ్లీ మాజీ స్పీకర్ సూర్యనారాయణరాజు, దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగిల హయాంలో రాపాక టీడీపీలో ఉండే వారు.

 బాలయోగి మృతి అనంతరం కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు తన అనుంగు శిష్యుడైన రాపాక తిరిగి సొంతగూటికి వస్తే ఆహ్వానించే వారిలో సూర్యనారాయణరాజు ముందుంటారని అంటున్నారు. రాపాక వస్తారో లేదో తెలియదు కానీఅలాంటి ప్రచారం మాత్రం టిక్కెట్టు రేసులో ఉన్న ఆశావహులకు మింగుడు పడడంలేదు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు లక్కవరంలో ముదునూరి చినబాబుతో మాజీ ఎంపీపీ ఉల్లూరి గోపాలరావు వంటి నేతలు ఆదివారం భేటీ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం లేదని సమావేశాన్ని ముగించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement