సాక్షి, అమరావతి : ‘మోత్కుపల్లికి గవర్నరో, రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ గురించి ఇలాంటి విమర్శలు చేయడం సరికాద’ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment