motkupalli narasimhuilu
-
మోత్కుపల్లి.. చంద్రబాబుని ఏమన్నావో గుర్తుందా?
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతిపరుడంటూ గతంలో అనేక ఆరోపణలు చేసిన తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు.. ఇప్పుడు ఉన్నట్టుండి బాబుపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తుండడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి నిప్పులు చెరిగారు.ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి చేసి అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా దీక్షకు దిగిన మోత్కుపల్లిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడని, నయవంచకుడని గతంలో విమ్మర్శలు చేసిన మోత్కుపల్లి ఇప్పుడు ఆయనేదో నీతిపరుడన్నట్లు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి.. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నాడన్నారు. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం అని మోత్కుపల్లిని వారించారాయన. అసలు అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు నాయుడని.. స్కిల్ స్కామ్‌లో కోట్లు కొల్లగొట్టాడని ఈరోజు ఆయన పాపం పండి కటకటాల పాలయ్యాడని అన్నారు. ఇక బీజేపీ నేత పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిలా కాకుండా టీడీపీ అధ్యక్షురాలిలా వ్యవహరిస్తోందని, ఆరోజు డబ్బు కోసం, పదవి కోసం ఆశపడి పురందేశ్వరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబు అవినీతిపరుడని చెబుతుంటే.. పురందేశ్వరి మాత్రం ఆయనేదో సత్యహరిశ్చంద్రుడన్నట్టు మద్దతిస్తున్నారన్నారు. మద్యం షాపుల్లో నగదు, ఆన్లైన్ పేమెంట్లు రెండూ తీసుకుంటున్నారని.. పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హెచ్చరిస్తూనే ఆమె ఏమైనా ఆడిటరా..? అని చురకలంటించారు. ఇది కూడా చదవండి: CBN: ఇంటరాగేషన్‌లో కాలయాపన.. ప్రశ్నలకు జవాబులు దాటవేత -
వేల కోట్ల భూములు ఈటెలకు ఎలా వచ్చాయి: మోత్కుపల్లి
-
‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని అటెకెక్కించింది చంద్రబాబేనని మండిపడ్డారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో నాడు దళితులను మోసం చేసిన బాబు, నేడు కాపులను మోసం చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని చంద్రబాబు కాపులకు ఏం ఒరగబెడతాడని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బాబు చేసే ప్రతి పనీ ఓట్లు, సీట్లు కోసమే ఉంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణాల్లో టీడీపీ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
మోత్కుపల్లి మదిలో ఏముందో..?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆయన ముఖ్య అనుచరులకు కూడా అంతుపట్టడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబును రెండు రోజుల పాటు చీల్చిచెండాడి ఆ తర్వాత మౌనం వహించిన ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావడం లేదు. టీఆర్ఎస్లో చేరాలా లేదా స్వతంత్రంగా ఉండి చంద్రబాబును టార్గెట్ చేయాలా అన్న విషయంలో ఆయన తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరతారని వార్తలు వస్తున్నా ఏదైనా పార్టీలో చేరితే తాను చంద్రబాబు విషయంలో చేయాలనుకున్నది చేయలేనేమోననే మీమాంçసలో మోత్కుపల్లి ఉన్నారని, స్వతంత్రంగా ఉండి చంద్రబాబు వెంటపడాలనే ఆలోచనలోనే ఆయన ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారంటున్నారు. ఆ రెండు భేటీల తర్వాతే నిర్ణయం తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండాలన్న దానిపై మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 13న ఆలేరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేడర్ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత 15న లేదా 16న ముఖ్య అనుచరులతో భేటీ అవుతారని సమాచారం. ఈ రెండు సమావేశాల తర్వాతే ఆయన అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. టీఆర్ఎస్లో ఆయన చేరినా ఎలాంటి పదవి ఇస్తారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఈ సమావేశాల్లో చర్చనీయాంశం కానుంది. మొత్తంమీద ఈ సమావేశాల్లో కేడర్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరాలని ఒత్తిడి వస్తే మాత్రం ఆయన మొగ్గు చూపుతారని, లేదంటే స్వతంత్రంగానే ఉంటారని తెలుస్తోంది. ఆయన స్వతంత్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే వచ్చే వారంలోనే ఏపీలో పర్యటిస్తారని సమాచారం. ఏదేమైనా మోత్కుపల్లి రాజకీయ పయనంపై మరో వారంలో స్పష్టత రానుంది. -
మోత్కుపల్లి.. అప్పుడెందుకు నోరు మెదపలేదు?
సాక్షి, అమరావతి : ‘మోత్కుపల్లికి గవర్నరో, రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ గురించి ఇలాంటి విమర్శలు చేయడం సరికాద’ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు. -
రేవంత్‌రెడ్డి కోసం చంద్రబాబు నన్ను పక్కన పెట్టారు
-
కేసీఆర్ మాదిగలను అణచివేస్తున్నారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన మాదిగలను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను మోత్కుపల్లి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం ప్రత్యేక ములాఖత్‌లో పరామర్శించారు. జైలు బయట మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ 59 కులాల మేలు కోసం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మంద కృష్ణను సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా జైల్లో పెట్టారన్నారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. -
మోత్కుపల్లి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఇదిలా ఉండగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. కేసీఆర్‌కు మేము వ్యతిరేకం కాదు... అణగదొక్కితే తిరగబడతాం... అంటూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పాలన్నారు. మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
'సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బతకాలనుకుంటోందని తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఏం జరిగిందని కేసీఆర్ ఉద్యమం చేస్తానని అంటున్నాడని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన సమయంలోనే సెక్షన్-8ను ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తోనే కేసీఆర్ వక్రబుద్ధి బయట పడిందని, ఆయన మాట్లాడే భాష హుందాగా లేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం లేదని, పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ సెంటిమెంటును మరో సారి వాడుకోవాలని చూస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పార్లమెంటు నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్‌లో ఉండి పదేళ్లపాటు పాలించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని పేర్కొన్నారు. బతికినంత కాలం తాను టీడీపీలోనే ఉంటానని మోత్కుపల్లి స్పష్టం చేశారు.