సాక్షి, హైదరాబాద్: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆయన ముఖ్య అనుచరులకు కూడా అంతుపట్టడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబును రెండు రోజుల పాటు చీల్చిచెండాడి ఆ తర్వాత మౌనం వహించిన ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావడం లేదు. టీఆర్‌ఎస్‌లో చేరాలా లేదా స్వతంత్రంగా ఉండి చంద్రబాబును టార్గెట్ చేయాలా అన్న విషయంలో ఆయన తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో చేరతారని వార్తలు వస్తున్నా ఏదైనా పార్టీలో చేరితే తాను చంద్రబాబు విషయంలో చేయాలనుకున్నది చేయలేనేమోననే మీమాంçసలో మోత్కుపల్లి ఉన్నారని, స్వతంత్రంగా ఉండి చంద్రబాబు వెంటపడాలనే ఆలోచనలోనే ఆయన ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారంటున్నారు.
ఆ రెండు భేటీల తర్వాతే నిర్ణయం
తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండాలన్న దానిపై మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 13న ఆలేరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేడర్ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత 15న లేదా 16న ముఖ్య అనుచరులతో భేటీ అవుతారని సమాచారం. ఈ రెండు సమావేశాల తర్వాతే ఆయన అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.
టీఆర్‌ఎస్‌లో ఆయన చేరినా ఎలాంటి పదవి ఇస్తారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఈ సమావేశాల్లో చర్చనీయాంశం కానుంది. మొత్తంమీద ఈ సమావేశాల్లో కేడర్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరాలని ఒత్తిడి వస్తే మాత్రం ఆయన మొగ్గు చూపుతారని, లేదంటే స్వతంత్రంగానే ఉంటారని తెలుస్తోంది. ఆయన స్వతంత్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే వచ్చే వారంలోనే ఏపీలో పర్యటిస్తారని సమాచారం. ఏదేమైనా మోత్కుపల్లి రాజకీయ పయనంపై మరో వారంలో స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment