సాక్షి, తిరుపతి : సార్వత్రిక ఎన్నికల్లో మోదీ 300 స్థానాల్లో గెలుస్తానని కలలు కంటున్నారు.. కానీ జనాలు మూడు పంగనామాలు పెడతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిహార్ సీపీఐ అభ్యర్థి కాటి తోపు హత్యను ఖండిస్తున్నామన్నారు. జాతిపిత గాంధీని అవమానిస్తూ బీజేపీ అభ్యర్థ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరం అన్నారు. తక్షణమే ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి దిగజారుడు ప్రధానిని చూడలేదని నారాయణ మండి పడ్డారు.
మోదీ ఆర్భాటంగా ప్రకటించిన స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా ద్వారా దేశానికి ఎంత మేలు కలిగిందో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్ వైఫల్యం కారణంగానే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు. ప్రధానిపై నమోదయిన కేసులన్నింటిలో ఆయనకు క్లీన్ చీట్ ఇస్తున్నారన్నారు. ఫలితంగా ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయిందని పేర్కొన్నారు. మే 23 తర్వాత మోదీ, అమిత్ షా సినిమాల్లో నటించాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జనాలు బీజేపీని 300 స్థానాల్లో గెలిపించడం కాదు.. మూడు నామాలు పెడతారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని నారాయణ ఆరోపించారు. కార్పోరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు.. ఎన్ని సిట్ దర్యాప్తులు చేసినా చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment