'సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బతకాలనుకుంటోందని తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఏం జరిగిందని కేసీఆర్ ఉద్యమం చేస్తానని అంటున్నాడని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన సమయంలోనే సెక్షన్-8ను ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తోనే కేసీఆర్ వక్రబుద్ధి బయట పడిందని, ఆయన మాట్లాడే భాష హుందాగా లేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.
ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం లేదని, పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ సెంటిమెంటును మరో సారి వాడుకోవాలని చూస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పార్లమెంటు నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్‌లో ఉండి పదేళ్లపాటు పాలించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని పేర్కొన్నారు. బతికినంత కాలం తాను టీడీపీలోనే ఉంటానని మోత్కుపల్లి స్పష్టం చేశారు.