మెట్రోపై.. ముందడుగు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు (మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్)పై మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎమ్మార్సీ)కు అప్పగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫీజుబులిటీ నివేదిక తయారీకి రూ.50 లక్షలు డీఎమ్మార్సీకి ఇచ్చేందుకు అంగీకరించింది.
రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహాగ్నిని చల్లార్చేందుకు సెప్టెంబర్ 4న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మన జిల్లాపై హామీల వర్షం కురిపించారు. తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నది ఆ హామీల్లో ఒకటి. విశాఖపట్నం, వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి)కు మెట్రో రైలును మంజూరు చేస్తూ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకున్నా.. తుడా అధికారులు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.
రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, ఆర్టీసీ బస్టాండు, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీనివాస మంగాపురం, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీజూ, అలిపిరి, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం మధ్యన తొలుత మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని తుడా అధికారులు ప్రతిపాదించారు. సుమారు 60 కిమీల మేర మెట్రో రైలు మారాన్ని నిర్మించాల్సి వస్తుందని తుడా అధికారులు అంచనా వేశారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు డీఎమ్మార్సీతో సర్వే చేయించాలని బుధవారం నిర్ణయించింది. ఫీజుబులిటీ నివేదిక ఇచ్చే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించింది. ఇందుకు రూ.50 లక్షలు ఫీజుగా ఆ సంస్థకు చెల్లించేందుకు అంగీకరించింది.
మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు తిరుపతిలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని డీఎమ్మార్సీ నివేదిక ఇస్తే.. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుగా డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను రూపొందించే బాధ్యతను కూడా అదే సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. డీఎమ్మార్సీ బృందం తిరుపతిలో పర్యటించి. మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఫీజుబులిటీ ఉందా లేదా అన్నది తేల్చితేనే ఆ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.