బెజవాడలో ‘మెట్రో రైలు’కు కదలిక!
విజయవాడ: వీజీటీఎం ఉడా పరిధిలో మెట్రో రైలు నిర్మాణం ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. బెజవాడను తాత్కాలిక రాజధానిగా పెద్ద పీట వేస్తారనే వార్తల నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు మళ్ళీ పట్టాలపై ఎక్కించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. తాత్కాలిక రాజధాని ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న క్రమంలో మూడు నెలల కాల వ్యవధిలో మెట్రో ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకురావడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక సర్వేలు పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మించనున్న పరిధి, ప్రాజెక్టుకయ్యే ఖర్చు, తదితర వివరాలు సిద్ధం చేశారు.
విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలిలను అనుసంధానం చేస్తూ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ నాలుగింటినీ కలుపుతూ మొత్తం 103 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు నిర్మితమవుతుంది. మూడు నెలల క్రితమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రంలోని వైజాగ్, వీజీటీఎం పరిధిలో మెట్రో రైళ్ళను ఏర్పాటుచేస్తామని అధికారిక ప్రకటన జారీచేశారు. ఆయన ప్రకటన చేసిన వారం రోజల వ్యవధిలోనే ఆ శాఖ కార్యదర్శి సుధీకర్ కృష్ణ నగరంలోని ఉడా కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి మెట్రో రైలు మార్గం నిర్మాణానికి అనుకూలంగా ఉందని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక పంపాలని ఉడా అధికారులు కోరారు. ఈ క్రమంలో ఉడా వైస్ ఛైర్మన్ ఉషాకుమారి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుచేయడానికి అంతా అనుకూలంగా ఉందని, ఇప్పటికే రైల్వే ట్రాక్‌లు నిర్మితమై ఉన్నాయని, వాటికి సమీపంలో నూతన ట్రాక్ నిర్మించటానికి కూడా అవసరమైన భూమి అందుబాటులో ఉందని గతనెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఉడా నివేదికను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును మొదలు పెట్టే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఐదేళ్ళ కాలవ్యవధి పడుతుంది. పనులు మూడు దశలుగా విభజించి చేసేలా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, ఒక కిలోమీటరు మెట్రో రైలు ట్రాక్ నిర్మించడానికి రూ. 200 కోట్లు వ్యయం అవుతుంది. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో కొద్దినెలల్లోనే ప్రజల రాకపోకలు మరింతగా పెరగనున్నాయి. దీనికనుగుణంగా మెట్రో రైలు పట్టాలెక్కితే ఉపయుక్తంగా ఉంటుంది.