సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ నగరంలో ప్రతిపాదించిన రెండు మెట్రో రైలు కారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తుది నిర్ణయానికి వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సవివర నివేదిక రూపకల్పనలో భాగంగా డీఎంఆర్‌సీ ఒక కన్సల్టెన్సీతో సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కన్సల్టెన్సీ బస్టాండ్ నుంచి రామవరప్పాడు రింగురోడ్డు మీదుగా 16వ నంబరు జాతీయ రహదారిపై బెస్ట్ ప్రైస్ షోరూం వరకు 13 మెట్రో స్టేషన్లు, బస్టాండ్ నుంచి కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ వరకు 12 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి టోపోగ్రఫీ సర్వే కూడా పూర్తి చేసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి టోపోగ్రఫీ సర్వే వివరాలను తెలుసుకున్న డీఎంఆర్‌సీ డెరైక్టర్ ఎస్‌డీ శర్మ, డెప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
రెండు కారిడార్లలో రోడ్డు ఎంత వెడల్పు ఉందనే విషయాన్ని పరిశీలించారు. స్టేషన్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించే ప్రాంతాల్లో ట్రాఫిక్, జనసాంద్రత తదితర వివరాలను సేకరించారు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి పరిసరాలను గమనించారు. ఏలూరు రోడ్డు కారిడార్‌లో బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్‌కు లింకు ఎక్కడ, ఎలా కలపాలనే దానిపై ఖురానా చర్చించినట్లు తెలిసింది.
ఆ తర్వాత బృందం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ప్రత్యేక కమిషనర్‌కు సర్వే పనులు, ఇతర వివరాలను అందించింది. సర్వే వివరాలు, పరిశీలించిన అంశాలపై బృందం సభ్యులు ఢిల్లీ వెళ్లి డీఎంఆర్‌సీ మాజీ ఎండీ శ్రీధరన్‌తో చర్చించనున్నారు. ఆయన వచ్చే నెల మూడో వారంలో నగరానికి వచ్చి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది.
మెట్రో స్టేషన్లు ఖరారు!
Published Tue, Dec 30 2014 4:48 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
Advertisement
Advertisement