పట్టాలెక్కిన మెట్రో
అనుమానాలున్నా సై అంటున్న ప్రభుత్వం
కేంద్రం అంగీకారం లాంఛనమేనన్న చంద్రబాబు
వెంకయ్యనాయుడిపైనే భారమంతా..
త్వరలో పనులు ప్రారంభించే అవకాశం
విజయవాడ బ్యూరో : అనుమానాల నడుమ విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతివ్వకపోయినా వెంకయ్యనాయుడిపై భారంవేసి ప్రభుత్వం పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వారం రోజుల్లోపే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్‌కు డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) టెండర్లు పిలవనుంది. అతి త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్‌తో చర్చించారు. కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావాల్సిన అనుమతుల వ్యవహారాన్ని చంద్రబాబు పూర్తిగా వెంకయ్య నెత్తిన మోపినట్లు సమాచారం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే మెట్రో ప్రాజెక్టుకు అనుమతి లభిస్తుంది. కానీ, విజయవాడ జనాభా 11 లక్షలే కావడంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విభజన చట్టంలో విజయవాడకు ఇచ్చిన మెట్రో హామీతోపాటు రాజధాని ఇక్కడే నిర్మిస్తున్న నేపథ్యంలో జనాభా నిబంధనను సడలించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రమ్రంతి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇక్కడి పరిస్థితిని వివరిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ అనుమతి రావడం లాంఛనమేనని చెప్పి డీఎంఆర్‌సీకి రూ.6,769 కోట్ల ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అధికారికంగా అప్పగించేశారు.
జనాభానే పెద్ద సమస్య
విజయవాడ మెట్రో ఫైనాన్షియల్ రిటర్న్స్ (ఎఫ్‌ఐఆర్‌ఆర్) 3.47 శాతం, ఎకనమిక్ రిటర్న్స్ 14.42 శాతం ఉన్నట్లు డీఎంఆర్‌సీ తన సవివర నివేదికలో పేర్కొంది. ఏ ప్రాజెక్టుకైనా 16 శాతం రిటర్న్స్ (తిరిగి వసూలు చేసే సామర్థ్యం) ఉంటేనే ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆ సామర్థ్యం లేకపోవడంతో ప్రభుత్వమే నిర్మాణానికి ముందుకొచ్చింది. విశాఖ మెట్రోదీ అదే పరిస్థితి. వాస్తవానికి మెట్రో లాంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు లాభాలు రావనేది బహిరంగ రహస్యమే. అందుకే, వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం భరించి మిగిలిన నిధులను విదేశీ రుణం ద్వారా సమకూర్చుకుంటాయి. అయితే, విజయవాడలో జనాభా మరీ తక్కువగా ఉండటంతో తిరిగి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని అంచనా. అయినా ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించింది.
త్వరలోనే శంకుస్థాపన
ప్రభుత్వ సూచనలతో డీఎంఆర్‌సీ పనులు చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కుదిరితే ఈ నెలలోనే టెండరు ప్రక్రియను ఖరారుచేసి రాజధానికి శంకుస్థాపన చేసినరోజే మెట్రోకూ శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.