సాక్షి, అమరావతి: మద్యం మహమ్మారి మత్తులో యువత జోగుతోందని ప్రజా సంఘాల, మద్య వ్యతిరేక పోరాట కమిటీ నేతలు గగ్గోలు పెడుతున్నా..పట్టించుకోని ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత నిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న 4,380 మద్యం షాపులు, 800 బార్లు సరిపోవన్నట్లు.. ఎక్కడపడితే అక్కడ..ఎప్పుడు పడితే అప్పుడు తాగేందుకు మద్యం ప్రియులకోసం మైక్రో బ్రూవరీ బార్లను ఏర్పాటు చేసేందుకు సర్కారు తలుపులు బార్లా తెరిచింది. బీరు, వైన్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది.
తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఈ ర్యాంకును అధిగమించేందుకు ఏపీలో బీరు అమ్మకాలు పెరిగేలా ఈ మైక్రో బ్రూవరీలను సర్కారు ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ మైక్రో బ్రూవరీ బార్లలో రెడీ టూ డ్రింక్ పేరిట బీరు, వైన్ అమ్మకాలు చేపట్టనుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణంలో ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసింది. ఈ తరహా మైక్రో బ్రూవరీ బార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసి మద్యం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. అయితే ఇంతవరకు మైక్రో బ్రూవరీలపై నిబంధనలు (గైడ్ లైన్స్) రూపొందించకుండానే విజయవాడ, విశాఖలలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయడం విమర్శల పాలవుతోంది.
రాయలసీమ మంత్రి తనయుడి ఒత్తిడితోనే..
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఎక్సైజ్ శాఖలోనూ తలదూర్చి చక్రం తిప్పుతున్నారు. విజయవాడ నగరంలో సదరు మంత్రి తనయుడు సొంతంగా మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. పాశ్చాత్య పోకడగా సాగుతున్న ఈ పార్లర్‌లో బీరు అమ్మకాల పర్యవేక్షణ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ మైక్రో బ్రూవరీల అనుమతుల ముసుగులో నూతన బార్లకు అనుమతులు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment