పోలీసులను ప్రతిఘటిస్తున్న కార్మికులు, మహిళను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు
బడి భోజన పథకం బాధ్యతను 15 ఏళ్లుగా చేస్తున్న వారిని కాదని.. ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడ్డారు. తమ కడుపు కొట్టొద్దని వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. పెద్దసంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపారేస్తున్నా.. వలువలూడేలా లాగేస్తున్నా.. మహిళా కార్మికులు ఏమాత్రం వెరవండా మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగించారు. మంత్రి ఇంటి సమీపంలోని జాతీయ రహదారిపైనా బైఠాయించారు.
విశాఖపట్నం: మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మిడ్ డే మీల్స్ వర్కర్లు కదం తొక్కారు. పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఒప్పుకునేది లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం నెలకు రూ.1000 జీతం ఇస్తున్న ఉద్యోగులను ఎందుకు తొలగించాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు. తమను తొలగిస్తే చంద్రబాబు పతనానికి అదే నాంది అవుతుందంటూ నినాదాలు చేశారు.
మూకుమ్మడి అరెస్టులు
ముట్టడిని నీరుగార్చేందుకు తొలుత నాయకులపై దృష్టి సారించిన పోలీసులు వారిని మూకుమ్మడిగా అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఒకపక్క అరెస్టులు జరుగుతున్నా వర్కర్లు ఆందోళన కొనసాగించారు. డబుల్‌రోడ్డులో రాకపోకలను అడ్డుకున్నారు. ఆందోళన ఉధృతం కావడంతో వందల మంది వర్కర్లను అరెస్టు చేశారు. ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. కార్యక్రమంలో యూనియన్ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు కె.ప్రసన్న, గౌరవ అధ్యక్షురాలు ఎస్.అరుణ, కార్యదర్శి జి.వరలక్ష్మి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలు మంగశ్రీ తదితరులు పాల్గొన్నారు.
గంటా ఇంటి ముట్టడికితీవ్ర యత్నం
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఎంవీపీ కాలనీలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడిం చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. సుమా రు 2 వేల మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనలో పాల్గొని గంటా నివాసాన్ని ముట్టడించేందుకు ప్ర యత్నించడంతో ఒక్కసారి అక్కడి వాతా వరణం వేడెక్కింది. వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీ సులు బారికేడ్లు ఏర్పాటు చేసినా ప్రతిఘటించి వాటిని గెంటుకుంటూ ముందుకు రావడంతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని మంతి గంటా ఇంటివైపు దూసుకు పోవడంతో పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చి పారేశారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి పోలీసువ్యానుల్లో తరలించారు.
మంత్రి ముఖం చాటేస్తున్నారు
తమ సమస్యలను వివరించాలని ఎన్నిసార్లు వచ్చినా మంత్రి గంటా శ్రీనివాసరావు కావాలనే ముఖం చాటేస్తున్నా రని మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే నవప్రయాస సంస్థకు అప్పగించినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. అదే జరిగితే రాష్ట్రప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తామన్నారు. ఇప్పటికైనే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, వర్కర్ల వేతనాలను రూ.1000 నుంచి 5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
వెట్టిచాకిరీ చేయించుకుని పొమ్మంటారా?
మాతో 12 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. కేవలం వెయ్యి రూపాయల జీతం, అదీ ప్రతీ నెల వచ్చే పరిస్థితి లేదు. తర్వాత అవకాశాలు ఉంటాయని ఓపిగ్గా ఎదురుచూస్తుంటే ఇప్పుడు మా సేవలు వద్దంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇన్నాళ్ల మా శ్రమకు ఫలితం ఏదీ? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
–గురవమ్మ, కె.నగరపాలెం(కాపుల దిబ్బపాలెం)
మమ్మల్ని ఎందుకు తొలగిస్తారు?
మిడ్‌డే మీల్ వర్కర్లను తీసేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఆ హామీ మర్చిపోయారా. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా సొమ్ములు దండుకోవడానికి మమ్మల్ని తీసేస్తారా? మాకిస్తున్న జీతం ఎంత? ప్రైవేట్ సంస్థల ద్వారా భోజనం పెడితే ఒరిగేదేంటి. ప్రభుత్వం వీటన్నింటికీ వివరణ ఇవ్వాలి. మమ్మల్ని తొలగించాలని చూస్తే చంద్రబాబు అందుకు మూల్యం చెల్లించాల్సిందే.
–పార్వతి,పేరంటాళ్లపాలెం (కశింకోట)
పదేళ్ల కష్టానికిఇదా ప్రతిఫలం?
పదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి పనిచేస్తున్నాం. చాలీచాలని సరకులు, అరకొర వేతనంతో సరిపెట్టుకుంటున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నాం. ఇంత చేసినా మా పొట్టకొట్టాలని చూడటం అన్యాయం. ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మానుకోవాలి.
– నూకరత్నం, బీసీ కాలనీ (అనకాపల్లి)
గుణపాఠం చెబుతాం
వెట్టిచాకిరీ చేయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోం. గతంలో మాదిరిగానే పథకాన్ని కొనసాగించాలి. వంటకు అవసరమైన సరుకులు సకాలంలో అందజేయడంతో పాటు జీతం రూ.5 వేలకు పెంచాలి. ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే గుణపాఠం చెబుతాం.
– కుమారి, అమనాం (భీమిలి)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment